- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో ‘ఇరిగేషన్’ శాఖా.. వద్దు బాబోయ్! చార్జ్ తీసుకునేందుకు జంకుతున్న ఐఏఎస్‌లు
ఇరిగేషన్ శాఖ పేరు ఎత్తితే చాలు ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇరిగేషన్ శాఖ పేరు ఎత్తితే చాలు ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు. ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ చేపట్టిన పనులపై ప్రస్తుతం న్యాయ విచారణలు, కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. అందుకే ఐఏఎస్ అధికారులు ఈ శాఖలో బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. ఒకవేళ బాధ్యతలు తీసుకుంటే ఆ కేసులు, విచారణలకు కావాల్సిన సమాచారం ఇవ్వడం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సెక్రెటరీ రాహుల్ బొజ్జ సైతం తనను ఆ శాఖ నుంచి తప్పించాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ సీఎం రేవంత్‌కు అప్పీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కాళేశ్వరం భయం..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనే విమర్శలున్నాయి. ఈ నిర్మాణంపై ఓ వైపు న్యాయ విచారణ కొనసాగుతుండగా, మరోవైపు జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తున్నది. దీనితో విచారణలకు కావాల్సిన సమాచారం ఇవ్వడం కోసమే అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ శాఖ బాధ్యతల్లో కొనసాగేందుకు ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అయిష్టంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తనను అ శాఖ నుంచి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయన్ను అక్కడి నుంచి తప్పించి కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాలనే అంశంపై సీఎంఓ పలువురు ఐఏఎస్‌ల పేర్లను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఆ లిస్టులో ఉన్న ఐఏఎస్‌లు తమకు ఇరిగేషన్ శాఖ వద్దని తిరస్కరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గతంలో ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చూసిన పలువురు సీనియర్ ఐఏఎస్‌లు సైతం ఆ శాఖ బాధ్యతలు తీసుకోలేమని నిర్మోహమాటంగా చెబుతున్నట్లు టాక్.






