'సుకేతన' వెంచర్ అక్రమాలపై రంగంలోకి అధికారులు.. విచారణ షురూ

by Prasad Jukanti |

రంగారెడ్డి జిల్లా చెరుకుపల్లిలోని స్వర్గసీమ సుకేతన వెంచర్ అక్రమాలపై అధికారులు రంగంలోకి దిగారు. డీఎల్‌పీవో వరలక్ష్మి విచారణ ప్రారంభించారు.

సుకేతన వెంచర్ అక్రమాలపై రంగంలోకి అధికారులు.. విచారణ షురూ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్‌ నగర్‌: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలో ‘స్వర్గసీమ శాండిల్‌ వుడ్‌ ఫార్మ్స్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుకేతన వెంచర్‌‍పై వచ్చిన ఫిర్యాదులకు జిల్లా యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాద్‌ నగర్‌ డీఎల్‌‌పీవో వరలక్ష్మి మంగళవారం సుకేతన వెంచర్‌ను సందర్శించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం ల్యాండ్‌‌ను ఎక్కడెక్కడ కేటాయించారో.. పాలకవర్గానికి వెంచర్‌ యాజమాన్యం చూపించడం లేదని ఇటీవల సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మంగళవారం సుకేతన వెంచర్‌ సందర్శనకు వచ్చిన డీఎల్‌పీవోకు సర్పంచ్‌తోపాటు, వార్డు సభ్యులు సుకేతన వెంచర్‌ అక్రమాలను వివరించారు. జీపీ ల్యాండ్‌ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేయకపోవడంతోపాటు ఎటువంటి బోర్డులు ఏర్పాటు చేయలేదని డీఎల్‌పీవో దృష్టికి తీసుకొచ్చారు. వెంచర్‌లో గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్‌ చేసిన రోడ్లను ప్రజా అవసరాలకు వినియోగించుకునేలా అనుమతులు కల్పించాలని, చుట్టూ ప్రహరీ నిర్మించి లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించడం వల్ల పంచాయతీకి గిఫ్ట్ డీడ్‌ చేసిన స్థలాలన్నీ వెంచర్‌ యాజమాన్యం గుప్పిట్లోనే ఉండిపోయాయని డీఎల్‌పీవో ఎదుట పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేసింది.

బండ్లబాటనూ క్లోజ్‌ చేశారు...

తాతల ముత్తాతల నాటి నుంచి ఉన్న బండ్లబాటను సుకేతన వెంచర్‌ యాజమాన్యం మూసి వేయడంపై స్థానిక రైతాంగం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎల్‌పీవోకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. చెరుకుపల్లి గ్రామంతోపాటు కస్లాబాద్‌, విశ్వనాథ్‌పూర్‌ వాసులు రాకపోకలు సాగించేందుకు బండ్ల బాట ఉపయోగకరంగా ఉండేదని రైతులు వివరించారు. వ్యవసాయ పొలాలకూ ఈ బండ్లబాట గుండానే వెళ్లేవారమని, అందరికీ ఇదే ఏకైక మార్గమని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సుకేతన వెంచర్‌ యాజమాన్యం చుట్టూ ప్రహరీని నిర్మించడం వల్ల బండ్ల బాట మూతబడి అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రహరీ నిర్మాణాన్ని తొలగించి బండ్ల బాటను పునరుద్ధరించాలని కోరారు.

వారంలో గ్రామసభ.. : వరలక్ష్మి, డీఎల్‌పీవో

పాలకవర్గం, రైతులు ఇచ్చిన ఫిర్యాదులపై వారంలో గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటామని డీఎల్‌పీవో వరలక్ష్మి తెలిపారు. సుచేతన వెంచర్‌ యాజమాన్యం జీపీకి కేటాయించిన ల్యాండ్‌ చుట్టూ రక్షణ కల్పించి బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెంచర్‌ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందని, వెంచర్‌‌కు ముందు, వెనుక వైపున ఏర్పాటు చేసిన కొన్ని ప్రీ కాస్ట్ వాల్స్‌‍ను ప్రజా అవసరాల కోసం తొలగించేందుకు అంగీకరించిందని చెప్పారు. దీనిపై వారం రోజుల్లో గ్రామ సభ నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. క్లబ్‌ హౌస్‌కు ఎటువంటి అనుమతులు లేవని, వారం రోజుల్లో ఫీజు చెల్లించి అనుమతులు తీసుకుంటామని వెంచర్‌ నిర్వాహకులు చెప్పారని తెలిపారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు. డీఎల్‌పీవో వెంట ఎంపీవో విజయ్‌ కుమార్‌, గ్రామ కార్యదర్శి శ్వేత తదితరులు ఉన్నారు.

పంటలు మునిగిపోతున్నాయ్‌..

వెంచర్‌ చుట్టూ గోడను ఏర్పాటు చేయడం వల్ల వర్షా కాలంలో నీళ్లన్నీ తమ పంటలను ముంచెత్తుతున్నాయని స్థానిక మహిళా రైతు పెంటమోల్ల లక్ష్మమ్మ డీఎల్‌పీవో ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో తన మూడున్నర ఎకరాల పొలంలోకి వర్షం నీళ్లు వచ్చి పంటలకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. పొలాన్ని తెగనమ్ముకోవడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని వాపోయింది. ఇది తన ఒక్కరి బాధే కాదని..చుట్టు పక్కల రైతులందరిదీ... ఇదే పరిస్థితి అని ఆమె వివరించారు. దండం పెడతా..గోడను తొలగించాలని లక్ష్మమ్మ విజ్ఞప్తి చేశారు.

Next Story