నాగారం’ ల్యాండ్స్‌పై అధికారుల మౌనం..! భూ హక్కుల వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలో పలు సర్వే నంబర్లలోని భూములపై రెవెన్యూ అధికారులు గోప్యత పాటిస్తున్నారు.

నాగారం’ ల్యాండ్స్‌పై అధికారుల మౌనం..! భూ హక్కుల వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలో పలు సర్వే నంబర్లలోని భూములపై రెవెన్యూ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఇక్కడ భూముల క్రయవిక్రయాలు చేస్తున్న వారికి.. భూ హక్కులు ఎలా వచ్చాయో చెప్పడానికి నిరాకరిస్తున్నారు. సర్టిఫైడ్, మ్యుటేషన్ కాపీలు ఇవ్వాలని చేసిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఆఖరికి హై కోర్టు ఆదేశాలను సైతం లైట్ తీసుకుంటున్నారు. నాగారంలోని సర్వే నంబర్ 194, 195లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు స్థలాలను కొనుగోలు చేయగా.. ఆ భూమి తనదంటూ నాగారానికి చెందిన వడ్త్యారాములు అంటున్నారు. అందుకే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు భూములు అమ్మిన వారికి.. ఆ భూహక్కులు ఎలా వచ్చాయో చెప్పాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.

హైకోర్టు ఆదేశించినా..

వడ్త్యా రాములు తండ్రి జమలాకు మహేశ్వరం మండలం నాగారం సర్వే నం.194, 195లో 9.09 ఎకరాల ల్యాండ్ ఉంది. దానికి సంబంధించిన పాస్ బుక్ టీ05160040374 ను జారీ చేశారు. ఇదే సర్వే నంబరులో 8.10 ఎకరాలు చేతులు మారింది. దానికి సంబంధించి సర్టిఫైడ్ కాపీలు, మ్యుటేషన్ ప్రొసిడింగ్ ఆర్డర్స్ ను ఇప్పించాలంటూ మహేశ్వరం మండల తహశీల్దార్ సైదులుకు వడ్త్యా రాములు మే 27 నుంచి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాటిని ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దాంతో వడ్త్యా రాములు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లో పూర్తి సమాచారాన్ని, డాక్యుమెంట్లను ఇవ్వాలని తహశీల్దార్ ను హై కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల మూడో తేదీన రిట్ నం.17871/2025 హైకోర్టు ఆర్డర్ కాపీని జత చేస్తూ మరోసారి అప్లయ్ చేశారు. అయితే మూడు వారాలు గడుస్తున్నా తహశీల్దార్ నుంచి ఎలాంటి స్పందన లేదని వడ్త్యా రాములు ‘దిశ’కు తెలిపారు. నాగారం సర్వే నం.194లో 9 ఎకరాలకు హక్కులు కల్పిస్తూ అర్షియా సుల్తానా, భర్త మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ కు పాస్ టీ05160040235, తేదీ.23.04.2018 జారీ చేశారు. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాసుబుక్స్ యాక్ట్, 1971 ప్రకారం రెవెన్యూ రికార్డులను సవరించేటప్పుడు, మార్పులు చేసేటప్పుడు, సరిదిద్దేటప్పుడు ఆసక్తిగలిగిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలి. 2018 లో రెవెన్యూ రికార్డుల్లో పలు సవరణలు చేశారు. దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు అడిగితే నిరాకరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని రాములు వాపోయారు.

వీరికి హక్కులెలా వచ్చాయి?

నాగారం సర్వే నం.194లో అర్షియా సుల్తానాకు 9 ఎకరాలు, మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు 9.20 ఎకరాలు, మహమ్మద్ అబ్దుల్ షరీఫ్ కు 8.10 ఎకరాల వంతున ఉన్నట్లు 2018లో పట్టాదారు పాసు బుక్స్ టీ05160040235, టీ05160040226, టీ05160040256 జారీ చేశారు. అయితే వీరికి హక్కులు ఎలా కల్పించారని వడ్త్యా రాములు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నోటరీ డాక్యుమెంట్ల ద్వారా మ్యుటేషన్ చేశారా? సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించారా? ఎవరు, ఎవరికి అమ్మారు? మ్యుటేషన్ ఎలా చేశారు? ఈ అంశాలపైనే అనుమానాలు నివృత్తి చేయాలని తహశీల్దార్ ను కోరుతున్నారు. నాగారంలో సర్వే నం.194, 195లోని భూమి వసూల్ బాకీ రిజిస్టర్ ప్రకారం పట్టాగా నమోదైంది. 194లో 383.20 ఎకరాలు హాజీ ఖాన్ సాహెబ్ నవాబ్ పేరిట ఉంది.

అలాగే 195లో 335.20 ఎకరాలు కూడా పట్టాగానే నమోదైంది. ఆ తర్వాత అనేక సబ్ డివిజన్లుగా మారింది. లేఖ నం.E5/623/2013, తేదీ.11.02.2019 ప్రకారం సర్వే నం.194, 195లోని ల్యాండ్ ను ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లో ప్రొహిబిటరీ ప్రాపర్టీ లిస్టు నుంచి తొలగించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి రాశారు. ఆ తర్వాత ధరణి పోర్టల్ లో పలు ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయి. దాంతో రుద్ర శ్రీనివాసులు, కొండూరి మనోహర్, మరో ముగ్గురు కలిసి సర్వే నం.194లోని 9.20 ఎకరాలను, మహమ్మద్ అబ్దుల్ జావిద్, కొండూరి మనోహర్, ఇతరులు కలిసి సర్వే నం.194లోని 9 ఎకరాలను బసబోయిన సురేశ్ కు అమ్మేశారు. ఇదంతా 2021లో జరిగింది. ఆ తర్వాత 62 లావాదేవీలు జరిగాయి. ఇందులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే టెర్మినస్ వెంచర్ ప్రైవేటు లిమిటెడ్ వంటి కంపెనీ కూడా ఉంది. అయితే వివాదాస్పదంగా మారిన భూములను కొనుగోలు చేయడంలో ప్రభుత్వంలోనే కీలక పాత్ర వహిస్తున్న, భూ పరిపాలనలోనే సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన నవీన్ మిట్టల్ వంటి వారి పేర్లు ఉండడం ఆసక్తికరంగా మారింది.

గోప్యత ఎందుకు?

నాగారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూముల వివరాలు ఇవ్వడానికి మహేశ్వరం తహశీల్దార్ సైదులు గోప్యత పాటిస్తున్నారు. సర్టిఫైడ్, మ్యుటేషన్ కాపీలు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంపై అనుమానాలు కలుగుతున్నాయి. అర్షియా సుల్తానా, మహమ్మద్ అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ అబ్దుల్ షరీఫ్ కు పట్టాదారు పాసు పుస్తకాలు ఎలా వచ్చాయి? మ్యుటేషన్ ఎలా చేశారు? ఈ వివరాలను దాచి పెట్టడంలో ఆంతర్యమేమిటని వడ్త్యా రాములు అధికారులను అడుగుతున్నారు. భూదాన్ భూమి కాకపోయినా, పట్టా భూమి అయినప్పటికీ ఏ విధంగా హక్కులు సంక్రమించాయో వివరాలు ఇవ్వడానికి హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

‘ఆఫీసర్ల’కు లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదా?

ఎవరైనా భూమిని కొనుగోలు చేసే ముందు లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరి చూసుకుంటారు. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. టైటిల్ క్లియర్ అన్న రూఢీకి వచ్చిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు వెళ్తున్నారు. అయితే నాగారంలో ఐఏఎస్, ఐపీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రికార్డులు వెరిఫై చేసుకున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. వీరికి భూములు అమ్మిన వారికి ఆ భూమిపై హక్కులు ఎలా వచ్చాయి? ఎప్పటి నుంచి కాస్తులో ఉన్నారు? ఎన్నేండ్లుగా రికార్డుల్లో ఉన్నారు? పహానీల్లో ఎన్ని దశాబ్దాలుగా పేర్లు వచ్చాయి? ఇలాంటివి పరిశీలించారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు కొనుగోలు చేసిన భూమి తనదని నాగారానికి చెందిన వడ్త్యా రాములు పోరాడుతుండడమే దీనికి నిదర్శనం.

సామాన్యులకైతే ఇలా..

* రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41లోని పట్టా భూమిని ఒకరు 15 గుంటలు 2019 లో స్టాంపు డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నారు. అయితే కొనుగోలుకు ముందే 1954 నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నంబరులోని భూమి పట్టాగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోకి కూడా ఎక్కింది. కానీ ఇప్పుడు అది ఖాస్రాలో ప్రభుత్వం ఉందంటూ పీవోబీలో నమోదు చేశారు. మూడు సార్లు అప్లయ్ చేస్తే తహశీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా రాసి రిపోర్ట్ పంపిస్తే.. అదనపు కలెక్టర్, కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 70 ఏండ్ల పహానీల్లో పట్టాగా ఉందని కొనుగోలు చేస్తే ఇప్పుడు శిక్షిస్తే ఎట్లా? ఇన్నాండ్లుగా ఎన్నో క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి అప్లయ్ చేయగా తాను వాస్తవాలను రిపోర్టులో పేర్కొంటున్నానని, ఉన్నతాధికారులు రిజెక్ట్ చేస్తే తానేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు.

* కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యరడపల్లిలో తరతరాలుగా పట్టాగా ఉన్న భూమిని ఖారీజ్ ఖాతాగా నమోదు చేశారు. కానీ తరతరాలుగా అది పట్టాగానే ఉందని పహానీలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పట్టాగా మార్చాలంటూ అప్లయ్ చేస్తే శంకరపట్నం తహశీల్దార్ మూడు సార్లు రిజెక్ట్ చేశారు. ఆఖరికి సీసీఎల్ఏ అధికారుల నుంచి ఫోన్ చేయించి ఖారీజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కాదని స్పష్టత ఇప్పించినా.. నెగెటివ్ రిపోర్టు రాశారు. ఏడు దశాబ్దాలుగా పట్టాగా ఉన్న భూములను పీవోబీలో నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటప్పుడు పెద్దోళ్లు భూములు కొనేటప్పుడు రికార్డులను వెరిఫై చేయకుండానే రిజిస్ట్రేషన్ చేయడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయి.

Next Story