రేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం.. తిరస్కరించరు.. ఆమోదించరు

by Yarlagadda Naga Rani |

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది రేషన్‌ దరఖాస్తుదారుల పరిస్థితి.

రేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం.. తిరస్కరించరు.. ఆమోదించరు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉంది రేషన్‌ దరఖాస్తుదారుల పరిస్థితి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియను చేపట్టింది. అధికారులు మాత్రం కార్డుల జారీలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. ముఖ్యంగా సరూర్‌ నగర్‌ సర్కిల్‌ పరిధిలోని రాజేంద్ర నగర్‌, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్‌, సరూర్‌ నగర్‌ మండలాల్లో రేషన్‌ కార్డులకు అప్రూవల్‌ ఇవ్వడంలో ఎడతెరగని జాప్యం నెల కొంది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల వద్ద జిల్లా వ్యాప్తంగా 41,197 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అందులో సరూర్‌ నగర్‌ సర్కిల్‌ పరిధిలోనే 33,207 దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి. జిల్లా కలెక్టర్‌తోపాటు, సివిల్‌ సప్లయ్‌ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు సైతం సం బంధిత ఏఎస్‌వోను తీవ్ర స్థాయిలో మందలించినప్పటికీ కార్డుల జారీలో వేగం అందుకోవడం లేదు. పైసలిస్తేనే కార్డుకు ఆమోదం తెలుపుతున్నారని ఆరోపణలు విన్పిస్తుండగా.. ఆ కారణంగానే జాప్యం నెలకొంటున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పటికీ సీరియస్గా తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.

తిరస్కరించరు..ఆమోదించరు!

కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, మీ సేవ కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు అర్హులను తేల్చిన తర్వాత ఏఎస్‌వో ఆమోదం తెలిపితే.. అక్కడి నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారి లాగిన్‌కు చేరుతుంది. 360 డిగ్రీల సాఫ్ట్ వేర్‌తో దరఖాస్తుదారుల ఆదాయ వివరాలను ఆధార్‌ కార్డు సాయంతో పూర్తి స్కాన్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సజావుగా సాగుతుండగా.. సరూర్‌ నగర్‌ సర్కిల్‌ పరిధిలోనే భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. నెలల తరబడిగా దరఖాస్తులు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల వద్దనే పెండింగ్‌లో ఉంటున్నాయి. తిరస్కరించడమో? లేక ఆమోదించడమో! చేయకుండా పెండింగ్‌ లోనే ఉంచుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్డుకు ఆమోదం తెలిపేందుకు ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే వెంటనే పని అయిపోతున్నదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. ఇక్కడి ఏఎస్‌వోతోపాటు రెవెన్యూ ఇన్ స్పె‍క్టర్ల తీరుపై సివిల్‌ సప్లయ్‌ ఉన్నతాధికారులకు సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు సైతం గుర్రుగానే ఉన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పలు సందర్భాల్లో నిర్వహించిన సమీక్షల్లో చీవాట్లు పెట్టినా ఆయా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. వారి స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించి కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘రెంటికీ చెడ్డ రేవడి’లా..

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 25,9 73 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేశారు. కొత్తగా 1,77,704 యూనిట్లను కార్డుల్లో నమోదు చేయగా.. 13,400 యూనిట్లను కార్డుల నుంచి తొలగించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి లాగిన్‌లో గురువారం నాటికి 5,100 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల వద్దనే పెండింగ్‌లో ఉంటు న్నాయి. దరఖాస్తులను పరిష్కరించడంలో ముప్పు తిప్పలు పెడుతుండడంతో కొందరి పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారైంది. కొత్త కోడళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వివాహమై అత్తగారింటికి వచ్చిన కొత్త కోడళ్లు తమ అత్తగారి కుటుంబంలోగానీ.. లేదా తన భర్తతో వేరుగా గానీ రేషన్‌ కార్డు కావాలంటూ మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నారు. తల్లిగారి కార్డులో పేరును తొలగించుకుంటేనే.. అత్తగారి కార్డులోగానీ.. భర్తతో కలిపి కొత్త కార్డును మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో చాలా మంది పాత కార్డుల నుంచి తమ పేర్లను తొలగించుకున్నారు. నెలల తరబడిగా ఆయా దరఖాస్తులు ఆమోదం పొందడం లేదు. నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ వీరి దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. ప్రభుత్వం సదాశయాన్ని అభాసు పాలు చేస్తున్న అధికారులపై ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Next Story