- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ సంకల్పానికి అధికారుల తూట్లు.. రెవెన్యూ సదస్సులపై ప్రచారం నిల్
భూ సమస్యలు లేని రికార్డులను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యలు లేని రికార్డులను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల మూడు నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నది. అయితే ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూస్తుంటే.. అనుమానం కలుగుతున్నది. ఇప్పటి వరకు 561 మండలాల్లోని 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. 4.61 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రతి ఊరిలో కనీసం వంద నుంచి రెండు వందల వరక సమస్యలు ఉంటాయని అంచనా. పైలెట్ గ్రామాల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. మరి ఇప్పుడు అప్లికేషన్లు తక్కువ రావడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ నడుస్తున్నది. అధికారుల తీరు, ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యమే ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి.
ప్రచారం చేయకుండా.. అప్లికేషన్లు స్వీకరించకుండా
గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఉద్దేశ్యపూర్వకంగా ముందస్తు ప్రచారం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక్క రోజు మాత్రమే సదస్సు నిర్వహించడం, అందులో కూడా రెండు, మూడు గంటల పాటే అధికారులు, సిబ్బంది ఆ ఊరిలో అందుబాటులో ఉంటుండడంతో బాధితులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు గతంలో అకారణంగా రిజెక్ట్ చేసిన దరఖాస్తులను మళ్లీ తీసుకోవడానికి సైతం నిరాకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డేటా చేంజ్, సర్వే నంబరు మిస్సింగ్, విస్తీర్ణం తక్కువ పడిందని వచ్చే అప్లికేషన్లు తీసుకునేందుకు అధికారులు స్వీకరించేందుకు ససేమిరా అంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ఖాస్రా పహానీ ప్రకారం రికార్డుల్లో పట్టాగా ఉన్న భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలన్న ఫిర్యాదులను కూడా తహశీల్దార్లు తీసుకునేందుకు మొండికేస్తున్నట్లు తెలుస్తున్నది. సులువుగా పరిష్కరించగల అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్నది.
‘లీఫ్స్’ కంటే తక్కువ దరఖాస్తులు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలు గ్రామాల్లో ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి లీఫ్స్ సంస్థ గతంలో అధ్యయనం చేసింది. రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. పది గ్రామాల్లోనే 4,461 సర్వే సబ్ డివిజన్లలో 2,114 మంది భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది. ఇప్పుడు అదే మండలంలోని 18 గ్రామాల్లో అప్లికేషన్లు 1,700 దాటలేదు. ఇక హైదరాబాద్ కు అత్యంత సమీపంలోని ఇబ్రహింపట్నంలో భూ సమస్యలు అధికం. మండలంలో 31 గ్రామాలకు గాను 27 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయి. అయితే 914 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనం కంటే.. రెవెన్యూ అధికారులు వెళ్తే దరఖాస్తులు తక్కువగా రావడంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఆరా తీయాల్సిన అవసరమున్నది.
ఇన్ని తక్కువ దరఖాస్తులా!
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మంథన్ గౌరెల్లిలో 85, మొండి గౌరెల్లిలో 125, చింతపట్లలో 200, నల్లవెల్లిలో 157, మాల్ లో 110, గున్ గల్ లో 124, గడ్డమల్లయ్య గూడలో 82, యాచారంలో 204, చౌదర్ పల్లిలో 14, నజ్దిక్ సింగారంలో 44, తక్కల్లపల్లిలో 43, మల్కిస్ గూడలో 93, తూలేఖుర్ద్ లో 161, కొత్తపల్లిలో 30, నందివనపర్తిలో 101, అయ్యవారిగూడెంలో 43, మేడిపల్లి నక్కర్తలో 25.. ఇలా మండలంలో దరఖాస్తు చేసుకున్న సంఖ్య 1682 మాత్రమే. అలాగే ఇబ్రహింపట్నం మండలంలోని ముక్నూరులో 17, ఎర్రకుంటలో 4, ఖానాపూర్ లో 117, కప్పాపహడ్ లో 42, నాగన్ పల్లిలో 95, పోల్కంపల్లిలో 42, రాయినిగూడలో 26, నర్రెపల్లిలో 10, పోచారంలో 18, రామిరెడ్డిగూడలో 4, ఇబ్రహింపట్నం భగత్ లో 121, తట్టిఖానలో 10, అలీమియాకుంటలో ఒక్కరు, చింతపల్లిగూడలో ముగ్గురు, మంగల్ పల్లిలో 26, సాహెబ్ గూడలో రెండు, కొంగర్ కలాన్ లో ఆరు, ఫిరోజ్ గూడలో ముగ్గురు, ఇబ్రహింపట్నం ఖాల్సలో 122, ఎలిమినేడులో 126, ఆదిబట్లలో 28, తులేకలాన్ లో 89 దరఖాస్తులు వచ్చాయి. ఎంగల్ గూడ, తురకగూడలో అసలు దరఖాస్తులే రాలేదు. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉండే ఈ రెండు మండలాలు ఉదాహరణ మాత్రమే. మిగతా మండలాల్లోనూ అతి తక్కువ అప్లికేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ధరణి పోర్టల్ లో పెట్టుకున్న అప్లికేషన్ల సంఖ్య ఒక్కో మండలంలోనే పది వేలకు పైగా ఉంటాయి. అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, సిబ్బంది గ్రామాలకు వెళ్లినప్పుడు దరఖాస్తులు పెట్టుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో గుర్తించాల్సిన అవసరమున్నది.
తక్కువ రావడానికి కారణాలు ఇవే!
– రైతులందరికి తెలిసేలా రెవెన్యూ సదస్సులపై సరైన ప్రచారం చేయలేదు.
– ధరణిలో అకారణంగా రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు మళ్లీ తీసుకోవడం లేదు.
– సివిల్, ఫారెస్టు కేసులను తిరస్కరిస్తున్నారు.
– భూ సమస్యలు పరిష్కరించడం ఇష్టం లేక, పని భారం పెరుగుతుందని అప్లికేషన్లు స్వీకరించడం లేదనే ఆరోపణలున్నాయి.
– డ్యాష్ బోర్డు క్లియర్ గా ఉంచుకునేందుకు అధికారుల తాపత్రయం.
–భూ భారతి చట్టం కింద అధికారాలు ఎక్కువగా ఇవ్వలేదన్న అసంతృప్తి తహశీల్దార్లలో ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వానికి లీఫ్స్ సంస్థ సిఫారసులు
– రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేరు. మాన్యువల్ గా ఇచ్చినా స్వీకరించాలి.
– ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో కనీసం నలుగురితో కూడిన సపోర్టింగ్ టీమ్ ఏర్పాటు చేయాలి.
– ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు స్వీకరించాలి. సింపుల్ ఫార్మాట్ ద్వారా రైతు సమస్యను అడగాలి.
– దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంట్లు అడిగి తీసుకోవాలి.
– వాటన్నింటిపైనా స్పీకింగ్ ఆర్డర్ రాయాలి. సమస్యలను పరిష్కరించాలి.
– తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలి. కానీ ఈ ప్రక్రియ జరగడం లేదు.






