నర్సింగ్ కాలేజీల అక్రమాలపై అధికారుల సీరియస్

by Ajay Maddhiboyina |

ప్రైవేటు నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి. 21 కాలేజీలపై ఆరోపణలు రాగా... వాటన్నింటిలోనూ విస్తృతంగా విచారణ జరిపి నివేదికలను డీఎంఈ కార్యాలయంలో అందించారు.

నర్సింగ్ కాలేజీల అక్రమాలపై అధికారుల సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు నర్సింగ్ కళాశాలల అక్రమాలపై వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి. 21 కాలేజీలపై ఆరోపణలు రాగా... వాటన్నింటిలోనూ విస్తృతంగా విచారణ జరిపి నివేదికలను డీఎంఈ కార్యాలయంలో అందించారు. విచారణ అధికారులు అందించిన నివేదికలను డీఎంఈ పరిశీలన అనంతరం చర్యలు తీసుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. ఒకే భవనంలో అనేక కాలేజీలను నిర్వహించడం సహా, చాలా చోట్ల గుర్తింపు తీసుకున్న అడ్రస్ లో భవనాలు లేవని, సగం నర్సింగ్ కళాశాలలకు పేరెంట్ హాస్పిటల్స్ లేవని డీఎంఈకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ కొనసాగింది. క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే నర్సింగ్ విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న దుస్థితికి కారణమైన ఈ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సైతం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు తనిఖీలు పూర్తి చేసి నివేదికలను ఒక్కొక్క బృందం డీఎంఈ కార్యాలయంలో అందచేసినట్లు అధికారులు తెలిపారు.

పేరుకే కాలేజీలు...

చాలా కళాశాలల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ కూడా కనిపించలేదని విచారణ చేపట్టిన అధికారులు కొందరు తెలిపారు. చాలా కళాశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు రోజువారీగా క్లాసులు చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఇక తనిఖీలకు వెళ్లిన వారిలో కొందరిని ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు మచ్చిక చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అలాంటి వారిపైన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉన్న చోట అవసరమైతే మరోసారి విచారణ చేపట్టేందుకు ఇతర బృందాలను పంపించేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో ఉండే ఓ మహిళా అధికారి అండదండలతోనే ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నాయని ఓ ఉన్నతాధికారి దిశకు తెలిపారు. వ్యవస్థను సరిచేసేందుకు ఈ వ్యవస్థను నిర్వహించే వారు సక్రమంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు.

నిబంధనల మేరకు లేకుంటే కఠిన చర్యలు తప్పవు...

-డా.శివరాం ప్రసాద్, డీఎంఈ (అకడమిక్స్)

రాష్ట్రంలో ప్రత్యేకంగా 21 ప్రైవేటు నర్సింగ్ కాలేజీలను నిబంధనల మేరకు నిర్వహించడం లేదని, ఒకచోట అనుమతితో మరోచోట నిర్వహిస్తున్నారని, మౌలిక వసతులు లేవని, ఫ్యాకల్టీ లేకుండానే కళాశాలలు నిర్వహిస్తున్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయి. నర్సింగ్ విద్యార్థులకు రావాల్సిన బెన్ఫిట్స్ సైతం సదరు కళాశాలలు కాజేస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 21 కాలేజీలపై విచారణ కోసం 42 మందితో కూడిన బృందాలను పంపించి విచారణ చేయించాం. గత ఏడాది ఇలాగే ఆరోపణలు వచ్చిన సందర్భంలో విచారణ తర్వాత ఓ నర్సింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేసి విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశాం. ఇప్పుడు కూడా నిబంధనల మేరకు లేని కాలేజీలపై డీఎంఈ స్థాయిలో లేదా హెల్త్ సెక్రటరీ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటాం.

Next Story