CM చెప్పినా ఆఫీసర్లలో కనిపించని కదలిక.. ఆఖరికి కోర్టే దిక్కంటున్న బాధితులు!

by Gantepaka Srikanth |

ధరణి నిబంధనలతో ఇప్పటికీ వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

CM చెప్పినా ఆఫీసర్లలో కనిపించని కదలిక.. ఆఖరికి కోర్టే దిక్కంటున్న బాధితులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి నిబంధనలతో ఇప్పటికీ వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం బుక్ చేసుకున్న స్లాట్ ను వివిధ కారణాలతో క్యాన్సల్ చేసుకుంటే.. ఇప్పటికీ ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ రాక సంవత్సరాలుగా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ సొమ్మును రిటర్న్ చేయించారు. కానీ నేటికీ వేలాది మంది ఫీజు వాపస్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సీసీఎల్ఏ మెమో నం.6309/అసైన్(1)/2021-22 ప్రకారం ఎవరైనా స్లాట్ బుక్ చేసిన ఆరు నెలల్లోపు క్యాన్సిల్ చేసుకుంటే.. స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేసే అధికారం కలెక్టర్ కు ఉంది. ఆరు నెలల తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్ అండ్ ఐజీకి రిటర్న్ చేసే అధికారం ఉంటుంది. కానీ ఈ అంశాన్ని వారు పట్టించుకోవడం లేదు. క్యాన్సిల్ చేసుకున్న స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేయాలని స్వయంగా సీఎం ఆదేశించినా అధికారుల్లో కదలిక రావడం లేదు. దీని కోసం సరైన మెకానిజం ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినా.. ఇప్పటికీ ఆ వైపు అడుగులు పడటం లేదు. దీంతో పలువురు కోర్టులను ఆశ్రయిస్తుండగా.. నాలుగు వారాల్లో అమౌంట్ ను చెల్లించాలని కోర్టులు కలెక్టర్లను ఆదేశించిన సందర్భాలున్నాయి.

కోర్టుకు వెళ్తే గానీ..

మేడ్చల్ జిల్లాకు చెందిన జక్కుల సుగుణావతి 2022 మే 17న నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. రూ.8,49,522 లను స్టాంప్ డ్యూటీ చెల్లించారు. కానీ అనివార్య కారణాల వల్ల 2022న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ స్టాంప్ డ్యూటీ రిటర్న్ చేయమని మూడేండ్లుగా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరికి న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హై కోర్టు.. తాజాగా పిటిషనర్ చెల్లించిన మొత్తం అమౌంట్ ను నాలుగు వారాల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. నాగిరెడ్డిగూడ సర్వే నం.59ఈ2, 59ఈ3లో 0.10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు ఒక వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 27న చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ రూ.2,25,976 చెల్లించారు. అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్నారు. చెల్లించిన స్టాంప్ డ్యూటీని తిరిగి ఇప్పించాలంటూ అదే సంవత్సరం జులై 20 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎవరూ సరైన రీతిలో స్పందించలేదు. దాంతో కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం రూ.2,25,976ను నాలుగు వారాల్లోపు 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద మొత్తంలో అమౌంట్ రావాల్సిన వారు కోర్టుకు వెళ్తున్నారు. అయితే రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు రావాల్సిన వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా కోర్టుకు వెళ్తే లాయర్ ఫీజుకే అమౌంట్ సరిపోతుందన్న భయం ఉంది. ఈ క్రమంలోనే కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మీ సేవా కేంద్రం నిర్వాహకులు సొంత అమౌంట్ ను కట్టి స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే నష్టపోయారు. అలాంటి వారు రంగారెడ్డి జిల్లాలోనూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ అంశంపై చొరవ చూపాలని బాధితులు కోరుతున్నారు.

సీఎం ఆదేశించినా..

స్లాట్ క్యాన్సల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ వాపస్ చేసే మెకానిజం ధరణి పోర్టల్ లో లేదు. భూ భారతి వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము రూ.120 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. 2024 డిసెంబరు 13న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించినప్పుడే అమౌంట్ ను రిటర్న్ చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ ఆ సొమ్మును రిటర్న్ చేసే మెకానిజంను ఏర్పాటు చేయలేదు. కొందరు కలెక్టర్లు మాత్రం కొంత మేరకు రిటర్న్ చేయించారు. ఇంకా వేలాది మంది బాధితులుగా మిగిలారు. దాంతో ఈ సమస్యపై బాధితులు కోర్టుకు వెళ్తుండడం గమనార్హం. ప్రస్తుతం భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వివరాలేవీ డ్యాష్ బోర్డులో కనిపించడం లేదు. ఇప్పుడు ఆధారం లేకుండా పోతున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బ్యాంక్ స్టేట్ మెంట్ ఆధారంగానే అప్లయ్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. దీంతో భూభారతిలోనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించేలా మెకానిజం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.

కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది - గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, న్యాయవాది

భూ భారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ధరణి పోర్టల్ లో చెల్లించిన సొమ్ము ఇవ్వకపోవడం అన్యాయం. స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి అప్పటికప్పుడు చెల్లించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. సీఎం, మంత్రి ఈ అమౌంట్ ను రిటర్న్ చేయొద్దని ఎక్కడా చెప్పరు. కేవలం అధికారులు నిర్ణయం తీసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. పెద్ద మొత్తంలో రావాల్సిన వాళ్లు మాత్రమే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు రావాల్సిన వారంతా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదేం చిన్న సమస్య కాదు. రూ.100 కోట్లకు పైమాటే. ఇప్పటికైనా అధికారులు బాధితులకు న్యాయం చేయాలి.

Next Story