- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జలసౌధలోనే ఏళ్ల తరబడి తిష్టవేసిన ఆఫీసర్లు
జలసౌధలో కొందరు అధికారులు ఏళ్ల తరబడి ఒకే విభాగంలో కొనసాగుతుండటం శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని జలసౌధ.. రాష్ట్ర సాగునీటి శాఖకు గుండె వంటి కార్యాలయం. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, పరిపాలనా నిర్ణయాలు, సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక ఫైళ్లు అన్నీ ఇక్కడి నుంచే కదులుతాయి. అయితే.. ఇక్కడ పనిచేస్తున్న కొందరు అధికారులు మాత్రం ఏళ్ల తరబడి ఒకే విభాగంలో కొనసాగుతుండటం శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం ఒకే స్థానంలో నిరంతరం కొనసాగకుండా నిర్దిష్ట వ్యవధి తర్వాత బదిలీలు చేయడం పరిపాలనా వ్యవస్థలో భాగం. దీంతో అధికారుల్లో పారదర్శకత పెరుగుతుంది. కానీ.. జలసౌధలోని ఈఎన్సీ (అడ్మిన్) విభాగంలో మాత్రం ఈ నిబంధనలు అందరికీ ఒకేలా అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిప్యూటీ ఈఎన్సీ నుంచి ఏఈఈ వరకు..
శాఖలోని డిప్యూటీ ఇంజినీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారుల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల వరకు పలువురు అధికారులు చాలా ఏళ్లుగా జలసౌధ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కొనసాగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. కొందరు మధ్యలో సెక్షన్ మారినా, కార్యాలయం మాత్రం మారలేదని అంటున్నారు. కొంత మంది అధికారులు పదేళ్లకు పైబడి కొనసాగుతుండగా.. మరికొందరేమో ఆరేళ్లకు పైబడిన అధికారులు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రధానంగా డిప్యూటీ ఈఈలు, ఏఈఈలు 20 మందికి పైగా లాంగ్ స్టాండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఈఎన్సీ వరకే బదిలీ చేయడం.. లేదంటే ఈఎన్సీ రిటైర్‌మెంట్ అయితే ఆయన స్థానంలో కొత్త వారిని నియమించడం వరకే తంతు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకానీ.. కీలక అధికారులను మాత్రం టచ్ కూడా చేయడం లేదన్న ప్రచారం జరుగుతున్నది.
సర్వీస్ వ్యవహారాలన్నీ వీరి చేతుల్లోనే..
సాధారణంగా అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్న వారే ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, పోస్టింగులు, సీనియారిటీ జాబితాలు, డిప్యూటేషన్లు, క్రమశిక్షణా చర్యలు, కోర్టు కేసులు, సర్వీస్ రికార్డులు వంటి అత్యంత కీలకమైన సర్వీస్ రిలేటెడ్ మ్యాటర్స్ ను పర్యవేక్షిస్తుంటారు. దీంతో ఎవరు ఎక్కడ పనిచేయాలి? ఎవరికి ఏ పోస్టింగ్ ఇవ్వాలి? ఎవరి ఫైల్ ఎప్పుడు కదలాలి? వంటి అంశాలు వీరి చేతుల్లోనే ఉంటాయి. ఏళ్లకేళ్లుగా వీరు అక్కడే ఉంటుండడంతో వీరు అనుకున్న వారికే పదోన్నతులు, ట్రాన్స్ ఫర్లు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా.. ఏటా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లలోనూ వీరిదే కీలక పాత్ర. అందుకే.. వీరి బాధ్యతలు ఆ స్థాయిలో ఉండటంతో పై స్థాయి అధికారులను మచ్చిక చేసుకుని అక్కడే కొనసాగుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
‘అడ్మిన్’ పోస్టులపైనే ఆసక్తి..
శాఖలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉండే విధంగా పరిపాలనా విధానాలను రూపొందించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినప్పుడు మినహాయింపులు, ప్రత్యేక పరిస్థితులు, పరిపాలనా అవసరాలు వంటి కారణాలను చూపిస్తూ అదే స్థానంలో కొనసాగుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలో పనిచేస్తున్న అధికారులు మాత్రం నిర్దిష్ట కాలపరిమితి పూర్తికాగానే తప్పనిసరిగా బదిలీ అవుతుండగా, జలసౌధలో పనిచేసేవారికి మాత్రం అవే నిబంధనలు ఎందుకు వర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఫీల్డ్ పోస్టింగులతో పోలిస్తే ప్రధాన కార్యాలయంలో పనిచేసే అధికారులకు అనేక పరిపాలనా ప్రయోజనాలు ఉంటాయని శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారులతో ప్రత్యక్ష సంబంధాలు, కీలక ఫైళ్ల నిర్వహణ, ప్రభుత్వ స్థాయి సమావేశాల్లో భాగస్వామ్యం, విధాన నిర్ణయాల్లో పరోక్ష పాత్ర వంటి అంశాలు ఈ పోస్టులను మరింత కీలకంగా మారుస్తున్నాయి. అందుకే ఒకసారి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి వచ్చిన అధికారులు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.






