సీఎం రేవంత్ రెడ్డి కూతురి భూమికి ఎసరు.. తెర వెనుక మాజీ మంత్రి అనుచరులు!

by Disha Web Desk 2 |
సీఎం రేవంత్ రెడ్డి కూతురి భూమికి ఎసరు.. తెర వెనుక మాజీ మంత్రి అనుచరులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించినా... ఆ భూముల హక్కుదారులుగా పాత పట్టాదారులనే ధరణి పోర్టల్ చూపిస్తున్నది. దీంతో కొత్త పాస్ బుక్‌లను తీసుకొని.. వాటి ఆధారంగా కొందరు క్రయవిక్రయాలు మొదలుపెడుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

మృతి చెందిన వ్యక్తి పేరిట..

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం పడమటి సాయిగూడెం సర్వే నం.18లో బండారి రాందాస్‌కు చెందిన మొత్తం 7.30 ఎకరాల భూమి ఔటర్ రింగ్ రోడ్డులో పోయింది. అప్పుడు ఆయన రూ.66 లక్షల వరకు నష్టపరిహారం పొందారు. అయితే ధరణి పోర్టల్ డేటాలో ఆయన పేరిట సర్వే నం.18/ఇలో 5.08 ఎకరాలు, 18/అలో 2.23 ఎకరాలు చూపించింది. దీంతో పోర్టల్‌లో వచ్చిన అప్లికేషన్ నం.2200003895 ద్వారా రాందాస్ పేరిట పాస్ బుక్ జారీ చేశారు. సర్వే నం.16/ఈ/1లో 0.18 ఎకరాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డులో పోయిన సర్వే నం.18/ఇలోని 5.08 ఎకరాలు కలిపి మొత్తం 5.26 ఎకరాలకు పట్టా ఇచ్చారు. అయితే ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే 2020 నవంబర్ 25న బండారి రాందాస్ మృతి చెందాడు.

అయితే ఆయన పేరిట వారసులు పట్టా పాసు పుస్తకం కోసం ఎలా దరఖాస్తు చేశారనేది అర్థం కాని విషయం. తొలుత సక్సెషన్ చేయించుకున్న తర్వాత వారసులకు పాసు పుస్తకాలు వస్తాయి. ఇక్కడ ఆధార్ కార్డుకి మొబైల్ నంబరు అనుసంధానం చేసి ఉండడంతో ఇది సాధ్యమైనట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరిట పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇదొక్కటే మార్గంగా ఉన్నది. సాధారణంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ చేయాలి. అంటే వేలి ముద్రలు వేయాల్సిందే. ఆ అవసరమే లేకుండా చనిపోయిన వ్యక్తి పేరిట అప్లయ్ చేయడం, పాసు పుస్తకం పొందడం వెనుక టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వారి సహకారం పుష్టిగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు

పట్టాదారు పాసు పుస్తకం కోసం బండారి రాందాస్ దరఖాస్తు చేసుకున్నారని, ముందుగా వాస్తవాలు పరిశీలించాలని పొరుగు రైతులు బండారి భూపతి, బండారి నర్సింగ్‌రావు అప్పట్లోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. నష్టపరిహారం తీసుకున్నారనడానికి సంబంధించిన అన్ని ఆధారాలనూ సమర్పించారు. అంతేకాకుండా అనేకసార్లు లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా కలెక్టర్, తహశీల్దార్లకు ఫిర్యాదు అందజేశారు. అయినా ఆ భూమికి పట్టా పాస్ బుక్ జారీ చేయడం గమనార్హం.

సీఎం కూతురి భూమి కూడా తమదేనంటూ..

సీఎం రేవంత్‌రెడ్డి కూతురు నైమిషారెడ్డి పేరిట మేడ్చల్ జిల్లా ఘట్‌కే‌సర్ మండలం పడమటి సాయిగూడెంలో సర్వే నం.18/అ/3/1/2/1/1 లో 0.09 ఎకరాలు, 18/అ/3/1/2/1/2 లో 0.13 ఎకరాల భూమి ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే కొనుగోలు చేశారు. ఐతే తాజాగా ఔటర్‌లో భూమి కోల్పోయిన, పట్టాదారు పాసు పుస్తకం పొందిన వాళ్లు ఇప్పుడు నైమిషారెడ్డి భూమి కూడా తమదే అన్నట్లుగా చూపిస్తున్నారు. కొత్త పాసు పుస్తకం ద్వారా ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ఒకరు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. అధికారులు సైతం సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. అయితే ఆ భూమి సీఎం రేవంత్‌రెడ్డి కూతురు పేరిట ఉందన్న విషయం తెలియక తతంగం నడిపినట్లు సమాచారం.

దర్యాప్తు జరిపితే వెలుగులోకి వాస్తవాలు..

ఔటర్ రింగ్ రోడ్డులో కొందరి భూమి పూర్తిగా పోయింది. మరికొందరిది పాక్షికంగా పోయింది. అయితే ధరణి పోర్టల్ డేటాలోని లొసుగుల ఆధారంగా కొందరు కొత్త పాసు పుస్తకాలు పొందుతున్నారు. పైగా ఖాళీగా ఉన్న భూములను చూపించి అమ్మేయడం, బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోట్లల్లో రుణాలు పొందుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు కింద సేకరించిన భూములన్నింటిపైనా సమీక్షించడం ద్వారా ధరణి పోర్టల్ ద్వారా పాసు పుస్తకాలు పొందిన వారెవరు? వారిలో అమ్మినవారు, కొనుగోలు చేసిన వారెవరు? వీటిని తనఖా పెట్టి రుణాలు పొందిన వారు ఎవరు? ఇలాంటి అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.

కీసరలోనూ అదే తీరు..

మేడ్చల్ జిల్లాలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రొసీడింగ్స్ నం. ఎల్ఎ./యూనిట్–4/34/2005, తేదీ.7–1–2009 ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు కోసం కీసర దాయరలో సర్వే నంబర్లు 162, 163, 164, 165, 167, 168, 169, 174, 176 కొంత భూమిని సేకరించారు. దానికి గాను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఐతే ఇందులో కొన్ని సర్వే నంబర్లలో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుల పేర్లను తొలగించకుండా యథాతథంగా కొనసాగించారు. దీంతో వారు భూ రికార్డుల ప్రక్షాళనలో 1 బీ, ఆ తర్వాత కొత్త పాస్ బుక్, పొందారు. రైతుబంధు కూడా అందుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లో కూడా వారి పేర్లే కనిపిస్తున్నాయి. ఇందులో రాగి అరుణారెడ్డి పేరిట భూమి ఉన్నది. హెచ్ఎండీఏ లేఖ నం.25/ఎల్ఎ/ఓఆర్ఆర్/యూనిట్–4/2017, తేదీ. 01.10.2018 ద్వారా సదరు భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించాలని రెవెన్యూ అధికారులకు లేఖ కూడా రాశారు.

కానీ పట్టించుకోలేదు. 2020–21 పహాణీల్లోనూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూముల జాబితా కనిపిస్తున్నది. 2016లో ఔటర్ రింగ్ రోడ్డు పోగా మిగిలిన భూమిని సేల్ డీడ్ నం.8364/2016 ద్వారా అమ్మేశారు. ఆ యజమానులు 2019 ఏప్రిల్ 29న డాక్యుమెంట్ నం.8195/2019 ద్వారా ఏజీపీఏ చేశారు. వీళ్లు తమకు మ్యుటేషన్ చేయాలంటూ ధరణి పోర్టల్‌లో దరఖాస్తు నం.2100104624 చేసుకున్నారు. కానీ తిరస్కరించడం గమనార్హం. నిజానికి పట్టాదారులకు మొత్తం 5.21 ఎకరాల భూమి ఉండేది. అందులో 1.13 ఎకరాలు ఔటర్‌కు ప్రభుత్వం తీసుకున్నది. మిగతా భూమిని 2016లోనే అమ్మేశారు. వాళ్లు మరొకరికి ఏజీపీఏ చేశారు. ఇప్పుడేమో ధరణి పోర్టల్‌లో కల్పించిన 1.13 ఎకరాల భూమి హక్కులకు సంబంధించిన కొత్త పట్టాదారు పుస్తకం ఆధారంగా మరొకరికి విక్రయించారు. సేల్ డీడ్ నం.313/2021 ద్వారా ఔటర్ రింగ్ రోడ్డులో సేకరించిన భూమినే విక్రయించారు. కనీసం ఏ సర్వే నంబరు, ఏ ప్రాంతం, ప్రొహిబెటెడ్ జాబితాలను సరిగ్గా చూసుకోకుండానే.. నిబంధనలను పాటించకుండానే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయాన్ని మిగిలిన భూమిని కొనుగోలు చేసిన వారే వెలుగులోకి తీసుకొచ్చారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం నేటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేదని బాధితులు ‘దిశ’కు వివరించారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి హస్తం: ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ, ఘట్‌కేసర్

ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో అక్రమాలు జరిగాయి. ఔటర్ భూములకు పాసు బుక్స్ ఇచ్చారు. ఆఖరికి సీఎం కుటుంబ సభ్యుల భూములకు కూడా ఎసరు పెడుతున్నారు. దీని వెనుక మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులే ఉన్నారు. ఆయన హస్తం లేకుండా ఏ దందా నడవదు. మా ఏరియాలో చోటు చేసుకున్న అనేక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇప్పటికీ మా ప్రాంతంలో మల్లారెడ్డిని మంత్రి అనే అనుకుంటున్నారు. అందుకే అధికారులు ఆయన పిలవగానే వెళ్తున్నారు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు.


Next Story

Most Viewed