ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం : హరీష్ రావు

by Disha Web Desk 23 |
ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం : హరీష్ రావు
X

దిశ,సదాశివపేట: కాంగ్రెస్ మాటలు నీటి మూటలేనని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న ఆయన, గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు.మెదక్ పార్లమెంట్​ సీటు గులాబీ​ ఓటమి ఎరుగని సీటు అని ఆయన అన్నారు. సదాశివపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో సోమవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనంతో ఉందని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే హస్తం పార్టీని బొందపెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

భవిష్యత్‌ బీఆర్​ఎస్​దేనని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.గులాబీ కంచుకోటలో మరో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒకరు మతంతో మరొకరు కులంతో మెదక్ లోక్​సభ సీటు కోసం పోటీకి వస్తున్నారని దుయ్యబట్టారు. తాము మాత్రం గతంలో చేసిన అభివృద్ధిని చూపుతూ ఓటుఅడుగుతున్నామని వివరించారు.దుబ్బాకలో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లుతుందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును​ ఉద్దేశించి హరీశ్​రావు విమర్శించారు. దుబ్బాకలో తమ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.

మెదక్ ఎంపీ సీటు కోసం బీఆర్​ఎస్​ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని అన్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్న మాజీమంత్రి, పేదలు వస్తే తన కుటుంబ సభ్యులుగా చూసే మంచి మనసున్న వ్యక్తిగా వెంకటరామిరెడ్డిని కొనియాడారు.20 ఏళ్లుగా ప్రజలకు సేవచేసి వారి హృదయాలను గెలుచుకున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నరు. మెదక్​ సీటుపై గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.రెండవ స్థానం కోసం మిగిలిన రెండు పార్టీలు పోటీ పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఆయనతోపాటు సంగారెడ్డిఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, స్థానిక పట్టణ, మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Next Story