భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడిన సూచీలు ఆఖరి గంటలో కొనుగోళ్ల ఉత్సాహంతో అధిక లాభాల వైపునకు మళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో ర్యాలీ మార్కెట్లకు కలిసొచ్చాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లలో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాది ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పెంచాయి. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 676.69 పాయింట్లు పుంజుకుని 73,663 వద్ద, నిఫ్టీ 203.30 పాయింట్లు లాభపడి 22,403 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం మినహా అన్ని రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది. మార్కెట్ల భారీ లాభాలతో మదుపర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది.Next Story

Most Viewed