పోలీసుల విధులకు ఆటంకం.. CID ముందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు

by Kema Shiva Kumar |

పోలీసుల విధులకు ఆటంకం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.

పోలీసుల విధులకు ఆటంకం.. CID ముందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసుల విధులకు భంగం కలిగించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy) ఇవాళ సీఐడీ (CID) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఈ విచారణకు హాజరుకావాలని సీఐడీ ఇప్పటికే ఆయనకు, ఆయన భార్యకు 41-A సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. జనవరి 29న వీణవంకలో సమ్మక్క-సారక్క జాతరకు 15 కార్లతో ర్యాలీగా వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే భద్రతా సమస్యలు ఉత్పన్నం అవుతాయని అడ్డుకున్న పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిని దూషించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులో పోలీసులు కౌశిక్ రెడ్డిని A1గా చేర్చారు. ఆయనతో పాటు మరో 15 మందిని సహ నిందితులుగా ఎఫ్‌ఐ‌ఆర్ (FIR)లో పేర్కొన్నారు. పోలీసుల విధులకు అడ్డంకి కలిగించడం, ప్రభుత్వ అధికారులను దూషించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని సీఐడీ కార్యాలయంలో అధికారులు కౌశిక్ రెడ్డి దంపతులను ప్రశ్నించనున్నారు. జనవరి 29న జరిగిన ఘటనకు సంబంధించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించడంతో పాటు, ఆ సమయంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాలను అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.

Next Story