NVS Reddy: ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్​వీఎస్​ రెడ్డి నియామకం

by Ramesh Naini |

మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్​వీఎస్​ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నియమించారు.

NVS Reddy: ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్​వీఎస్​ రెడ్డి నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన (NVS Reddy) ఎన్​వీఎస్​ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా (Government advisor) ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నియమించారు. ఆయన స్థానంలో హెచ్ఎండీఏ కమిషనర్​గా పనిచేస్తున్న ఐఏఎస్​ అధికారి సర్ఫరాజ్​ అహ్మద్​ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్వీఎస్​ రెడ్డి అర్బన్ ట్రాన్స్​ పోర్ట్​ సలహాదారుడిగా రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్​ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి రిలీవ్​ చేసి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకున్న అనుభవాన్ని పట్టణ రవాణా రంగంలో వినియోగించుకోవడానికి గాను అర్బన్​ ట్రాన్స్​ పోర్ట్​ సలహాదారుడిగా నియమించారు.

వీరితో పాటుగా పలువురు ఐఏఎస్​ అధికారులను బదిలీ చేశారు. స్టడీ లీవ్​లో వెళ్లి వచ్చిన శృతి ఓజా ను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​గా నియమించారు. పంచాయతీరాజ్​ కమిషనర్​ శ్రీజన ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ గా పనిచేస్తున్న కృష్ణా ఆదిత్యకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్​ఎండీఏ కార్యదర్శిగా కోటా శ్రీవాస్తకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

నాన్​ కేడర్​ అధికారులకు..

ఆయిల్​ ఫెడ్​ ఎండీగా జి.జితేందర్​ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్​ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయిల్​ ఫెడ్​ ఎండీగా ఇప్పటి వరకు శంకరయ్య పనిచేశారు. ఆయన స్థానంలో జితేందర్​ రెడ్డిని నియమించారు. నాన్​ కేడర్​ లో పనిచేస్తున్న పలువురు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్​ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్​ చీఫ్​ రేషనింగ్​ ఆఫీసర్​గా ఎం.రాజిరెడ్డిని నియమించారు. ఆయన ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థలో జీఎంగా పనిచేస్తున్నారు. కరీంనగర్​ గృహనిర్మాణ శాఖలో పీడీ పనిచేస్తున్న రాజేశ్వర్​ ను ఆదిలాబాద్​ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్​గా నియమించారు. పోస్టింగ్​ కోసం ఎదురు చూస్తున్న స్పెషల్​ గ్రేడ్​ మున్సిపల్​ కమిషనర్​ వెంకన్నను జాయింట్​ మెట్రోపాలిటన్​ కమిషనర్​గా నియమించారు. ఈ మేరకు సీఎస్​ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story