- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ సమస్యలు పరిష్కారించాలి.. నిమ్స్ హాస్పిటల్లో నర్సుల ఆందోళన
ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో నిమ్స్ నర్సెస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో నర్సింగ్ సిబ్బంది సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నా, ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో నిమ్స్ నర్సెస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతోనే శాంతియుత ఆందోళన చేస్తున్నామని యూనియన్ నేతలు తెలిపారు. ఈఎల్ ఇన్‌కాష్‌మెంట్‌ను నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించినట్లుగా అమలు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచాలని, మహిళా ఉద్యోగులకు మూడు నెలల చైల్డ్ కేర్ లీవ్, ఖాళీలను భర్తీ చేసి కాంట్రాక్ట్ నర్సులపై పెరుగుతున్న భారం తగ్గించాలని, క్లినికల్ నర్సింగ్ ఆఫీసర్స్, కాలేజ్ నర్సింగ్ స్టాఫ్ క్యాడర్ రివ్యూ చేయాలని, నర్స్-పేషెంట్ రేషియో సరిచేసి వర్క్‌లోడును తగ్గించాలని.. తదితర సమస్యల పరిష్కారం కోసం తాము గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదని నిమ్స్ నర్సెస్ యూనియన్ ఆరోపించింది.
రోగులకు అందించే సేవలు, సంస్థ పని తీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే సంగతి తెలిసినా.. తమ సమస్యలను పట్టించుకోని పరిస్థితుల్లో తమకు నిరసన తప్ప మరో మార్గం లేదని యూనియన్ నాయకులు తెలిపారు. తాము గత వారం రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని.. యాజమాన్యం తమను క్యాంపస్ లోపలే తాళం వేసి నిర్బంధించినట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను తెలియజేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నర్సులపై ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నర్సుల భద్రత, హక్కులు, పని పరిస్థితులపై యాజమాన్యం స్పందించకుండా, ఆందోళనను అణచివేయాలనే ఉద్దేశంతోనే క్యాంపస్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నిమ్స్ నర్సెస్ యూనియన్ కోరింది.






