51కి చేరిన కల్తీ కల్లు బాధితులు.. 9 మంది మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-11 04:22:48  IST  )

హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

51కి చేరిన కల్తీ కల్లు బాధితులు.. 9 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) ప్రాంతంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం సేవించి తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన బాధితుల సంఖ్య 51కి చేరింది. గాంధీ ఆస్పత్రిలో 14 మంది బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. నిమ్స్‌లో 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురికి పరిస్థితి విషమంగా ఉండటంతో డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. అలాగే, ESI ఆస్పత్రిలో ఒకరు, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు.

ఇక కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి సంఖ్య 9కి పెరిగింది. బాధితుల్లో పలువురు వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉండగా, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. మద్యం తాగిన కొద్ది గంటల తర్వాతే వాంతులు, తలనొప్పి, దృష్టి మందగించడం, అపస్మారక స్థితి వంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రుల పాలవుతుండగా, అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో బాలానగర్‌ ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. కల్తీ మద్యం తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో పాటు నగరంలో మద్యం నియంత్రణపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Next Story