- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 153కు పెరగనున్న ‘అసెంబ్లీ’ల సంఖ్య.. ఆ మండలాల వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు కేంద్రం లేఖ
జనగణన పూర్తయిన తర్వాత.. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకర్గాల సంఖ్య పెరగనుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జనగణన పూర్తయిన తర్వాత.. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకర్గాల సంఖ్య పెరగనుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా యూనిట్‌గా డీలిమిటేషన్ చేస్తుండడంతో ‘అసెంబ్లీ’ల రూపురేఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దు తుది జాబితాను అందించాలని ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. అంటే డిసెంబర్ 31 నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణనను చేపట్టనున్నారు. ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను పునర్విభజించనున్నారు. దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతోపాటు.. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం కనిపిస్తున్నది.
సగటు ఆధారంగా..
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు పెరిగే అవకాశముంది. అయితే జనాభా సగటు ఆధారంగా పది శాతం తక్కువకానీ, ఎక్కువ కానీ ఉండే విధంగా నియోజకవర్గాలను విభజిస్తారు. ఉదాహరణకు.. 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లుగా లెక్కిస్తే.. ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా 2.61లక్షలుగా ఉంటుంది. దీనికి పది శాతం ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను జిల్లా యూనిట్‌గా తీసుకొని ఏర్పాటు చేస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో సగటు తీస్తారు. ఆ జిల్లాలో జనాభాను సగటు తీసుకొని నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేస్తారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు 12.5 కన్నా తక్కువగా సీట్లు రావడంతో ఆ నంబర్‌ను 12గానే పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక సీటును తగ్గించి అప్పటి వరకు ఉన్న 13 స్థానాలను 12కు తగ్గించారు. ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్‌గా 153 సీట్లను విభజించి.. ఆ సంఖ్యను ఖరారు చేస్తారు.
మారనున్న బార్డర్స్
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపాదిక అని కేంద్రం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లాల యూనిట్‌గానే దేశ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అంటే జిల్లాల్లో ఉన్న మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలోని 30కి పైగా నియోజకవర్గాలకు చెందిన మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. కొడంగల్, పాలకుర్తి, హుస్నాబాద్ లాంటి సెగ్మెంట్లు మూడు జిల్లాల్లో, భూపాలపల్లి, పరకాల, కల్వకుర్తి, జనగామ, గజ్వేల్, హుజూరాబాద్ లాంటి స్థానాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. అంటే పునర్విభజన తర్వాత అలాంటి నియోజకవర్గాలు ఇకపై ఒక జిల్లా పరిధిలో ఉన్న మండలాలకే పరిమితమవుతాయి. అంతేకాకుండా ములుగు, మెదక్, వనపర్తి లాంటి జిల్లాల్లో ఇప్పుడున్న మండలాలతోనే ఒక కొత్త సీటు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడెం, గంగారం మండలాలు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. రాబోయే పునర్విభజనలో అవి మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటయ్యే అసెంబ్లీలో ఒక భాగంగా ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ రెండు భద్రాచలం నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. సిరిసిల్ల, గద్వాల, భూపాలపల్లి, నారాయణపేట్ తదితర జిల్లాల్లో ఇప్పుడున్న మండలాలతోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడుతాయి.
జిల్లా సరిహద్దులు మార్చడానికి ఆటంకాలు
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని, సరిహద్దులు మార్చవద్దని జనాభా లెక్కల అధికారులు ఎక్కడా చెప్పలేదు. డిసెంబర్ 31 నాటికి ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఆ తర్వాత కొత్త మండలాలు, గ్రామాలు, జిల్లాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినా.. పరిగణనలోకి తీసుకోరు. అప్పటి వరకు ఉండే సరిహద్దులను మాత్రమే పరిగణలోకి తీసుకొని జనాభాను లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఇలా జనాభా లెక్కలతో గెజిట్ విడుదల చేసి.. దాని ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
ఒకసారి ఎన్నికైతే.. ఆయన ఐదేళ్లండ్ల పాటు ఆ జిల్లాకు చైర్మన్‌గా ఉంటారు. వారు ఎన్నికయ్యాక జిల్లాల మార్పు ఎంతవరకు సాధ్యమవుతుందో అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అమలులో ఉన్నాయి. ఇప్పుడున్న జిల్లాలను జోన్లు, మల్టీ జోన్లుగా విభజించారు. వీటిని మారిస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వీలు ఉండదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. బీసీ రిజర్వేషన్లు కొలిక్కి రాగానే.. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఒక సారి జిల్లాను మారిస్తే.. వాటి ఆమోదానికి ఎక్కువ సమయం పట్టవచ్చని, దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన చేయడం అనేది ప్రభుత్వానికి ఒక సాహసంగా మారనుంది. మరోవైపు రాజకీయ పార్టీలకూ పునర్విభజన అంశం టెన్షన్‌గానే మారింది.
ఏపీలో షురూ..
జిల్లా యూనిట్‌గా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ముందే గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.. ఇప్పటికే అక్కడి జిల్లాల పరిధిని మార్చే పనిలో పడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి.. జిల్లాలను పునర్విభజించే పనిలో నిమగ్నమయ్యారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేసిన జిల్లాల విభజనను మారుస్తున్నారు. డిసెంబర్ నాటిని జిల్లాల సరిహద్దులను ఖరారు చేసే పనిలో సీరియస్ గా ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏర్పాటు చేసే జిల్లాల ఆధారంగా అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది.






