- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోర వైఫల్యం.. కేంద్రం తీరుపై పెల్లుబికిన ఆగ్రహం
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేపదే పేపర్ లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలు వెలుగుచూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో తగిన సంస్కరణలు తీసుకురాకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం, వైద్య నిపుణులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంతటి కీలకమైన పరీక్ష పట్ల ఎన్టీఏ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ రద్దు, పేపర్ లీక్ ఉదంతంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విద్యార్థులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ.. ‘నీట్ రద్దు కావడం అత్యంత దురదృష్టకరం. ఈసారి తెలంగాణలో సుమారు 73 వేల మంది, దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా, పకడ్బందీగా పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి, ఇంత పెద్ద తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మనోవేదనకు గురవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.
సమగ్ర విచారణ జరపాలి: టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ విభాగం
టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ స్పందిస్తూ.. ‘కేంద్రం, ఎన్టీఏ కలిసి లక్షలాది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. ఒకవైపు ఎన్ఎంసీ నిబంధనలు సడలిస్తూ వైద్య ప్రమాణాలను దెబ్బతీస్తున్న కేంద్రం, మరోవైపు 180 ప్రశ్నల్లో 135 లీక్ అయ్యేలా వ్యవహరించి దేశ విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.
సీబీఐ విచారణ చేపట్టాలి: టీ జూడా
టీ జూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నరహరి చంద్రకాంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘పేపర్ లీక్ నెట్‌వర్క్‌పై నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరపాలి. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు, లీకేజీ ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థులపై శాశ్వత అనర్హత వేటు వేయాలి. భవిష్యత్తులో డిజిటల్ ప్రోటోకాల్స్‌తో భద్రత పటిష్టం చేయాలి’ అని వెల్లడించారు.
ఇది ముమ్మాటికీ వ్యవస్థీకృత వైఫల్యమే : డాక్టర్స్ అసోసియేషన్
హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కార్తీక్ నాగుల స్పందిస్తూ.. ‘నీట్-యూజీ పరీక్ష ప్రక్రియ కుప్పకూలడం వ్యవస్థీకృత వైఫల్యానికి నిదర్శనం. రాజస్థాన్ ఎస్ఓజీ విచారణలో వెల్లడైన అంశాలు పరీక్షా వ్యవస్థ సమగ్రతను దెబ్బతీశాయి. సీబీఐ విచారణను అత్యంత పారదర్శకతతో వేగవంతం చేయాలి. ఎన్‌క్రిప్టెడ్ పేపర్ ట్రాన్స్‌మిషన్, అడ్వాన్స్‌డ్ డిజిటల్ సర్వైలెన్స్ వంటి విధానాలను తక్షణమే అమలు చేయాలి’ అని తెలిపారు.
వ్యవస్థాగత నిర్లక్ష్యం వీడాలి: డా. డి. శ్రీనాథ్
ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ జాతీయ అధ్యక్షుడు డా. డి. శ్రీనాథ్ స్పందిస్తూ.. ‘ఎగ్జామ్ మాఫియా, గెస్ పేపర్లు వైద్యులు ఎవరో నిర్ణయించే స్థాయికి వ్యవస్థ దిగజారిపోవడం శోచనీయం. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల జీవితాలను ఈ పేపర్ లీక్ ఘటన ప్రశ్నార్థకం చేసింది. దోషులకు కఠిన శిక్షలు విధించాలి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు’ అని అన్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఎన్టీఏను ప్రక్షాళన చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. తక్షణమే పేపర్ లీకేజీ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేసి, వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థుల్లో మళ్లీ నమ్మకం కలిగించేలా కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






