BRS Vs Congress: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2025-02-04 06:41:39  IST  )

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది.

BRS Vs Congress: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress) లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇవాళ తెలంగాణ శాసనసభ కార్యదర్శి (Legislative Assembly Secretary) నోటీసులు పంపించారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా?అన్న అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తొలుత పిటిషన్ దాఖలు చేయగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ లపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ (Telangana Speaker) జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తో జత చేసి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేస్తూ ఈ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని చెప్పారు. మిగతా వారు సైతం ఇదే బాటలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ:

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి విచారణ జరపబోతున్న నేపథ్యంలో ఆలోపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నోటీసుపై వివరణ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గడువు కోరితే ఆ గడువు ఎప్పటి వరకు ఉండనున్నది? ఒక వేళ వివరణ ఇస్తే ఆ వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా అనేది ఆసక్తిని రేపుతున్నది. మొత్తంగా రాజకీయంగా సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తోంది.

Next Story