మంత్రి పొంగులేటి కాదు.. ‘పొంగులూటీ’: హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-09 09:29:07  IST  )

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

మంత్రి పొంగులేటి కాదు.. ‘పొంగులూటీ’: హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) టార్గెట్‌గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి రాష్ట్రానికి మంత్రిలా కాకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అధినేతలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ సాక్షిగా పొంగులేటి తన సహచర మంత్రుల అవినీతిని అంగీకరించారని పేర్కొన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలను సభలో ఒప్పుకున్నారని, నాలుగు ప్రభుత్వ శాఖలు విచారణ జరిపి నివేదిక ఇచ్చినా, నోటీసులు జారీ చేసినా తనకు సంబంధం లేదనడం పొంగులేటి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. పొంగులేటి తన పొగరు తగ్గించుకోవాలని, ఆయన అక్రమాలను భవిష్యత్తులో మరిన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పేరును ‘పొంగులూటీ’ అని సంబోధిస్తూ హరీశ్ రావు సెటైర్లు వేశారు.

ప్రభుత్వ భూమే అయితే బౌన్సర్లు ఎందుకు..

ప్రభుత్వ భూముల కబ్జాపై హరీష్‌రావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఏం చేస్తోందని నిలదీశారు. నాదర్‌‌గుల్‌లో ఉన్నవి ప్రభుత్వ భూములే అయితే పొంగులేటి అక్కడ బౌన్సర్లతో కాపలా పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. శిల్ప, AQ వంటి సంస్థల్లో పొంగులేటి కుమారుడికి వాటా లేదా అని ఆయన నిలదీశారు. 2016లోనే నాదర్‌గుల్ (Nadargul) భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని హరీష్‌రావు గుర్తు చేశారు. అలాంటి భూములపై ఇప్పుడు జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి అక్రమ సంపాదనపై తాము వెనక్కి తగ్గబోమని, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మాజీ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Next Story