డంపింగ్ యార్డ్ కాదు.. మీథేన్ బాంబు: ప్రమాదకరంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక మీథేన్ కేంద్రాల్లో 4వ స్థానంలో నిలిచింది.

డంపింగ్ యార్డ్ కాదు.. మీథేన్ బాంబు: ప్రమాదకరంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన అత్యంత కాలుష్య కారక మీథేన్ ఉద్గారాలను వెదజల్లే డంపింగ్ యార్డులలో జవహర్ నగర్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డు నాలుగో స్థానంలో ఉండడంతోపాటు ముంబయిలోని కంజూర్‌మార్గ్ డంపింగ్ యార్డు 12వ స్థానాన్ని దక్కించుకున్నది. మొదటి మూడు స్థానాల్లో బ్యూనస్ ఎయిర్స్, జకార్తా, కౌలాలంపూర్ సైట్లు ఉన్నాయి.

18 దేశాల్లోని 25 డంపింగ్ కేంద్రాలు..

గ్లోబల్ వార్మింగ్‌కు కారకాలైన కార్బన్ డయాక్సైడ్ కన్నా ప్రమాదకరంగా మారిన మీథేన్ ఉద్గారాలు వెలువరించే కేంద్రాలను ‘స్టాప్ మీథేన్’ పేరుతో లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసిన అధ్యయనం నివేదిక వెల్లడించింది. 18 దేశాల్లోని 25 డంపింగ్ యార్డులను సర్వే చేశారు. 2025లో ఉపగ్రహాల ద్వారా అంతరిక్షం నుంచి గంటకు 3.6 నుంచి 7.6 టన్నుల మీథేన్‌ను విడుదల చేసే డంపింగ్ యార్డులకు యూనివర్సిటీ ర్యాంకులను కేటాయించింది. అయితే గంటకు 5 టన్నుల మీథేన్‌ను విడుదల చేసే డంపింగ్.. 10 లక్షల స్పోర్ట్స్ యూటిలిటీ కార్లు (ఎస్యూవీ) విడుదల చేసే ఉద్గారాలతో సమానం. మీథేన్.. కార్బన్ డయాక్సైడ్ (CO2) కన్నా 86 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైనది. దీంతోపాటు గ్లోబల్ వార్మింగ్‌లో మీథేన్ ది 45 శాతం కన్నా ఎక్కువ ప్రభావం ఉంటుందని నివేదిక వెల్లడించింది.

గంటకు 5.9 టన్నుల మీథేన్..

జవహర్ నగర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డంపింగ్ యార్డులో గంటలకు 5.9 టన్నుల మీథేన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్టు కాలిఫోర్నియా యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయర్స్ డంపింగ్ యార్డు గంటకు 7.6 టన్నులు, జకర్తా 6.3 టన్నులు, కౌలాలంపూర్ 6 టన్నులు, జవహార్ నగర్ డంపింగ్ యార్డు గంటకు 5.9 టన్నులు, ముంబయిలోని కంజూర్‌మార్గ్ డంపింగ్ యార్డు నుంచి గంటకు 4.9 టన్నుల మీథేన్ ఉద్గారాలను వెలువరిస్తున్నట్టు నివేదికలో వెల్లడించారు. అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డులో 2025 ఫిబ్రవరి 14, డిసెంబర్ 26 మధ్య ఏడు వేర్వేరు రోజులలో పరిమాణాత్మక ఉద్గార ప్లూమ్‌ల డేటా 14 సార్లు సేకరించారు. డంప్ సైట్ నుంచి అతిపెద్ద మీథేన్ ప్లూమ్ డిసెంబర్ 5, 2025న గంటకు 11.1 టన్నుల ఉద్గార రేటుతో గుర్తించారు.

ప్రమాదకరంగా..

జవహార్ నగర్‌లో పేరుకుపోయిన 12 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాల డంప్ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా తీవ్ర వాయు, నీటి కాలుష్యంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధులబారిన పడుతున్నారు. దీనిపై స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తోంది. కోర్టు మధ్యంతర ఆదేశాల ఆధారంగా లెగస్సీ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం సాంకేతిక సలహాదారులుగా బాంబే ఐఐటీని నియమించుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే డంపింగ్ యార్డు నిర్వహణలో సంబంధిత ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలూ లేకపోలేదు.

Next Story