- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పీఏసీఎస్‌లలో 'నామినేటెడ్' జోష్
తెలంగాణలో సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పాలకవర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11,778 మంది నేతలకు పదవులు దక్కనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో సహకార సంఘాలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్న ట్లు తెలిసింది. పీఏసీఎస్‌లలో ఇప్పటి వరకు ఎన్నికల విధానం ఉండగా, ఇక నుంచి నామినేటెడ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్నటివరకు పర్సన్ ఇన్‌చార్జీలతో పాలన సాగగా.. కొత్త కమిటీల ఏర్పాటు వరకు పాతవారే బాధ్యతలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు చెందిన వారే మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. సొసైటీల్లో ప్రతిపక్ష నేతలు చార్జ్ తీసుకోవడంతో హస్తం నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. వెంటనే పాలకవర్గాలను భర్తీ చేయాలని వారు కోరడంతో ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది.
కేబినెట్ నిర్ణయం.. మొదలైన లాబీయింగ్
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహకార సంఘాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, అర్హులైన వారి జాబితాలను ఈ నెలాఖరులోగా అందించాలని ఆదేశించింది. దీంతో అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావహులు ఈ సారైనా తమకు రాజకీయ దారి చూపాలని కోరుతూ పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 906 సంఘాలు ఉండగా, 11,778 మంది అధికార పార్టీ నేతలకు రాజకీయ ఉపాధి లభించనుంది.
కమిటీలు ఇలా..
ఒక్కో సంఘానికి చైర్మన్‌తోపాటు 12 మంది సభ్యులతో పాలకవర్గాన్ని నియమించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఏపీలో అమలులో ఉన్న విధానాన్నే ఇక్కడ పరిగణనలోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పాలకవర్గంలో ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, ఇద్దరు బీసీ జనరల్, ఒక ఓసీ మహిళ, మరో ఏడుగురు జనరల్ సభ్యులు ఉంటారు. పదవుల్లో నియమితులయ్యే వారు ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలి. గతంలో రుణాలు తీసుకుని చెల్లించకుంటే అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ రాజ్ సంఘాల్లో, ఇప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు.
రెండు విడతల్లో భర్తీ
పాలకవర్గాలను రెండు దశల్లో భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ముందు పాత సంఘాలకు పాలకవర్గాలను ఏర్పాటు చేసి, రెండో విడతలో కొత్త వాటికి నియమించనున్నారు. కొత్త మండలాల్లో 131 నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని సహకార శాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జిల్లా నుంచి పంపిన ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదముద్ర వేస్తే దశలవారీగా ఇవి ఏర్పాటు కానున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన సంఘాల విస్తరణలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల రెండు గ్రామాలకు ఒక సంఘం ఉంటే మరికొన్ని చోట్ల 30 గ్రామాలకు కలిపి ఒకటే సంఘం ఉంది.
సభ్యత్వ పరంగా ఒక సంఘంలో 500 మంది ఉంటే, మరికొన్నింటిలో 2,500 మంది రైతులు ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 81 మండలాల్లో ఒక్క సహకార సంఘం లేదు. ఈ వ్యత్యాసాలను గమనించిన ప్రభుత్వం, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి 31 జిల్లాల నుంచి వచ్చిన 215 ప్రతిపాదనలను పరిశీలించి, 131 మండలాలకు సహకార శాఖ జాబితా సిద్ధం చేసింది. కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తే రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే పంట రుణాలు పొందే అవకాశముంది.
కొత్త పాలకవర్గాలు వస్తే మెరుగైన సేవలు
రాష్ట్రంలో మొన్నటి వరకు పీఏసీఎస్ కేంద్రాలకు పర్సన్ ఇన్ చార్జీలు ఉండడంతో రైతులకు అరకొరగా సేవలందాయి. ప్రభుత్వంపై విపక్ష నేతలు దుమ్మెత్తిపోశారు. సహకార సంఘాలకు ఎన్నికలు జరపడం లేదని ఓటమి భయంతో వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల విధానానికి స్వస్తి పలికి నామినేటెడ్ విధానం తెరపైకి తీసుకొచ్చారు. కొత్త పాలకవర్గం కొలువు దీరితే రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు ఇవ్వడంతోపాటు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్ గేజ్, వ్యవసాయ యాంత్రీకరణ, పశుపోషణ, బంగారంపై రుణాలు అందుతాయి.
పీఎసీఎస్ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో రైతులు ప్రాథమిక సహకార సంఘాల్లో కొనుగోలు పెరుగుతుంది. యూరియా 80 శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతుంది. పీఏసీఎస్ కేంద్రాలు ఏటా 5 వేల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. పలు రకాల సేవలందిస్తుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు సహకారం ఇప్పటికే నామినేటెడ్ విధానానికి సంబంధించిన నివేదికను అందజేసింది.






