- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన ‘రైతు భరోసా’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ విజయోత్సవ సభ’లను ప్లాన్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన ‘రైతు భరోసా’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ విజయోత్సవ సభ’లను ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ‘రైతు భరోసా విజయోత్సవ సభ’లపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ‘రైతు భరోసా’ పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి రూ.12 వేలకే పరిమితం చేయడం మోసం చేయడమేనని అన్నారు. గత వానకాలం ‘రైతు భరోసా’ ఎగ్గొట్టి, యాసంగిలోనూ ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేని ఆక్షేపించారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టారని.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు, రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ ప్రశ్నించారు. రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా, రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా, రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా అని ధ్వజమెత్తారు.
అన్ని పంటలకు బోనస్ అని.. సన్నాలకే పరిమితం చేశారని ఆరోపించారని హరీశ్ రావు అన్నారు. రూ.1,200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా, ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా, పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా రైతు భరోసా విజయోత్సవాలు అంటూ సెటైర్లు వేశారు. లగచర్ల (Lagacharla), రాజోలి (Rajoli) రైతుల చేతుల చేతులకు బీడీలు వేసినందుకా. ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వనందుకా.. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపనందుకా అని ఎద్దేవా చేశారు. జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి, రైతులకు సకాలంలో అందించినందుకా, వరంగల్ రైతు డిక్లరేషన్ అటకెక్కించినందుకా, మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా.. ఎందుకు సంబురాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్నదాతల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్పకూలుతున్నాడని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే.. కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వమని పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని.. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.






