వీసీ లేని కాళోజీ వర్సిటీ.. ఏండ్లు గడుస్తున్నా పోస్టు భర్తీ కాని వైనం

by Kema Shiva Kumar |

పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో కీలక పోస్టులు భర్తీకి నోచడం లేదు.

వీసీ లేని కాళోజీ వర్సిటీ.. ఏండ్లు గడుస్తున్నా పోస్టు భర్తీ కాని వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో కీలక పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. యూనివర్శిటీలో వీసీ నుంచి మొదలు అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా సమస్యలు ఉత్పన్నం అవ్వడంతో పాటు వైద్య విద్యలో ప్రమాణాలు పాటించడంలోనూ వర్శిటీ వెనుకబడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో సుమారు 350 యూజీ, పీజీ, దంత, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు అనుగుణంగా పోస్టులు అవసరం ఉంటాయి. జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉండాలి. కానీ ప్రభుత్వం కేవలం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ పోస్టులకు మినహా మిగతా వాటికి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మరో వైపు పదేళ్లు గడిచినా నేటి వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించక పోవడం విమర్శలకు తావిస్తోంది.

శాశ్వత వీసీ నియామకం ఊసే లేదు..

కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో పలు కీలక విభాగాలను గాడిలో పెట్టేవారు లేకుండా పోయారు. గతేడాది జూన్‌లో వీసీ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వీసీ పోస్టు ఫిలప్ చేయడంలో పలు అభ్యర్థనలు రావడంతో సర్కారు దీనిపై సరైన డెసిషన్ తీసుకోవడం లేదని తెలుస్తున్నది. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని వీసీ పోస్టును ఫిలప్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పదేళ్లు డిప్యూటేషన్‌పై ఒకే వ్యక్తి

పదేళ్ల నుంచి వర్సిటీ వీసీగా డిప్యూటేషన్‌పై కరుణాకర్ రెడ్డిని కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా మూడేళ్లకోసారి వీసీని నియమిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఆయన పదవీ కాలాన్ని మూడు నుంచి ఆరు నెలల వరకూ పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ ఒకే వ్యక్తిని ఏకంగా పదేళ్లు వీసీగా డిప్యూటేషన్ పై కొనసాగించడం వెనకున్న మతలబేంటో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరో వైపు పరీక్షల నిర్వహణ విభాగంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ పోస్టులో ఎంబీబీఎస్‌ చేసిన వారు ఉండాలి. కానీ ఓ దంత వైద్యుడినే కొన్నేళ్లుగా డిప్యూటేషన్‌పై కొనసాగిస్తున్నారు.

సమస్యలు పట్టించుకునే వారే కరువు

కొన్ని ప్రయివేటు కళాశాలలు విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వారికి చెల్లించాల్సిన ఉపకార వేతనాన్ని తీసుకుంటున్నా వర్సిటీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతేడాది 700 మంది బీఎస్సీ ఎలైడ్‌ సైన్స్‌ విద్యార్థులు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వందల సంఖ్యలో స్టూడెంట్స్ ఫెయిల్‌ అయ్యారు. ఇందులో వర్సిటీ తప్పిదం ఉందంటూ కొందరు వైద్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. వర్శిటీకి వచ్చిన విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ లేదు. ధృవ పత్రాల జారీలోనూ పొరపాట్లు దొర్లుతున్నాయని పలువురు ఫిర్యాదు చేసేందుకు వర్శిటీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా పట్టించుకునేవారు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయి వీసీని నియమించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పట్టించుకోక పోతే వైద్య విద్యలో ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story