కాళేశ్వరంతో నో యూజ్..! నిండుకుండలా అన్ని ప్రాజెక్టులు

by Kema Shiva Kumar |

కాళేశ్వరంతోనే తెలంగాణకు భవిష్యత్తు అని.. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని.. తెలంగాణకు వరప్రదాయిని అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.

కాళేశ్వరంతో నో యూజ్..! నిండుకుండలా అన్ని ప్రాజెక్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంతోనే తెలంగాణకు భవిష్యత్తు అని.. ఈ ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని.. తెలంగాణకు వరప్రదాయిని అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఇటీవల సైతం ఆ పార్టీకి చెందిన అధినేత, మాజీమంత్రులు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ, తాజా వర్షాలతో కాళేశ్వరం అవసరం తెలంగాణకు లేదని మరోసారి నిరూపితమైంది. కాళేశ్వరం నిండకున్నా.. అక్కడి నుంచి నీరు ఎత్తిపోయకున్నా రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. జలకళతో మాత్రమే కాకుండా ప్రాజెక్టుల గేట్లూ తెరుచుకున్నాయి. పెద్ద స్థాయిలో ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండటంతో అదే స్థాయిలో ఔట్ ఫ్లో వెళ్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీల పంపులు నడిపించకున్నా వరద ఉరకలెత్తుతున్నది. ఎక్కడికక్కడ గోదావరి భారీగా ప్రవహిస్తున్నది. ఏ ప్రాజెక్టు చూసినా నిండుకుండలా కనిపిస్తున్నది. గోదావరితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు సైతం గేట్లు తెరుచుకున్నాయి. మొత్తానికి 10 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు గేట్లు తెరుచుకోవడం విశేషం.

మేడిగడ్డ కుంగినా ఆగని వరద..

కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీళ్లు లేకున్నా.. మేడిగడ్డ కుంగినా, అన్నారం సుందిళ్లలో నీటి చుక్క ఆపకున్నా.. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటడమే కాకుండా గేట్లు తెరుచుకున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు మిడ్ మానేరు, ఎల్ఎండీలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రతో, ఎగువన గోదావరి పరివాహకంలో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీకి మూడు రోజులుగా ఇన్ ఫ్లో కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం సాయంత్రానికి 2,75,000 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. 4,03,867 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 18 వేల క్యూసెక్కుల నీటిని ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు వదులుతున్నారు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు 18.92 టీఎంసీలకు చేరుకున్నాయి.

ఈ ప్రాజెక్టు పరివాహకంలో కురిసిన వర్షాలతో 3,74,943 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 3,88,971 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటితోపాటు ఎన్టీపీసీకి నీటిని విడుదల చేయటంతో పాటు.. నంది పంప్ హౌజ్‌కు 6,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ఐదు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 4.12 టీఎంసీల నీటిని వదిలారు. ఇక.. మిడ్ మానేరు జలాశయంలో 10.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రస్తుత నీటి మట్టం 310.80 మీటర్లు ఉంది. ఈ నీటి మట్టం 311.14 మీటర్లకు చేరితే.. నీటి నిల్వ 13.13 టీఎంసీలకు చేరుతుంది. అప్పుడు ఒక పంప్ ఆన్ చేయటం వీలవుతుంది. ఇప్పుడున్న ఇన్ ఫ్లో ప్రకారం ఈనెల 20 నుంచి పంపింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని ఇరిగేషన్ ఇంజినీర్లు తెలిపారు. మిడ్ మానేరు నుంచి నాలుగు పంప్‌లు రన్ చేయాలంటే 25.77 టీఎంసీలకు నీటి నిల్వ చేరాలి. అటు.. మేడిగడ్డకు సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,65,170 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం, సాగర్‌కు భారీగా వరద

మరోవైపు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సైతం భారీ ఎత్తున తరలివస్తున్నది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు తెరుచుకున్నాయి. మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,99,423 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 4,43,004 క్యూసెక్కులు ఉంది. అలాగే.. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో 4,10,186 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,09,506 క్యూసెక్కులు ఉంది. కాగా.. శ్రీశైలానికి సంబంధించి 10 గేట్లను ఎత్తగా.. నాగార్జునసాగర్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో 26 గేట్లను ఓపెన్ చేశారు. అటు ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో జలవిద్యుత్ కొనసాగుతూనే ఉంది. ఇక.. భద్రాచలం వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉంది. సోమవారం సాయంత్రానికి 36 అడుగులకు గోదావరి చేరింది. దిగువకు 6,18,466 క్యూసెక్కులు వెళ్తున్నది.

నిండిన చిన్ననీటి వనరులు

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి. ఊరూరా చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి. దాంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు అలుగు పారుతుండటంతో అంతటా ఆనందం వెల్లివిరిస్తున్నది. కేవలం 10 రోజుల్లో కురిసిన వర్షాలతో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. మొన్నటివరకు బోసిపోయి కనిపించిన చిన్ననీటి వనరులు.. ఒక్కసారిగా నీటితో నిండిపోయాయి. మొన్నటివరకు సాగు ఎలా అనుకుంటున్న తరుణంలో వర్షాలు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయి. దాంతో ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తూనే ఉన్నది.

Next Story