- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు డిస్కం ఏర్పాటుపై అసత్య ప్రచారం.. అంతా చట్టబద్ధమేనన్న అధికారులు
టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటుపై ఈఆర్సీ అనుమతి లేదని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి లేదంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ చట్టాల ప్రకారం కొత్త డిస్కం ఏర్పాటు అనేది రాత్రికి రాత్రి సాధ్యం కాదని, దీని వెనుక పారదర్శకమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రస్తుతం కంపెనీల చట్టం పరిధిలోనే ప్రాథమిక అడుగులు పడుతున్నాయని వివరించారు. కొత్త సంస్థ ఉనికిలోకి వచ్చాక పాత డిస్కంల నుంచి సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, వినియోగదారుల డేటాను వేరు చేస్తామని, దీనిని చట్టబద్ధంగా ట్రాన్స్‌ఫర్ స్కీమ్ అంటారని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటే ఉద్యోగుల కేటాయింపులు కూడా జరుగుతాయన్నారు.
డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ రూల్స్-2005 ప్రకారం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేసి ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీ నమోదు కాగానే నేరుగా విద్యుత్ పంపిణీ చేయడానికి వీల్లేదని, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 12, 14, 15 నిబంధనల ప్రకారం పంపిణీ లైసెన్స్ కోసం ఈఆర్సీకి దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు పరిశీలన అనంతరం ఈఆర్సీ బహిరంగ నోటీసు ఇచ్చి, ప్రజా విచారణ (పబ్లిక్ హియరింగ్) జరిపి, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే లైసెన్స్ మంజూరు చేస్తుందని తెలిపారు. ఆ తర్వాతే మౌలిక వసతులు, వినియోగదారుల బదిలీ పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ సుదీర్ఘ ప్రక్రియలో ఈఆర్సీ అనుమతి అనేది అత్యంత కీలకమైన భాగమని, కేవలం కంపెనీ రిజిస్ట్రేషన్ దశను చూపిస్తూ ఈఆర్సీని పక్కనబెట్టారనడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో సాగే వ్యక్తిగత ఎజెండాలు, అపోహలను నమ్మకుండా అధికారిక చట్టాలు, నిబంధనలను గమనించాలని అధికారులు కోరారు.






