Thummala : మీ రాజకీయాల కోసం రైతులను టెన్షన్ పెడతారా.. బీఆర్ఎస్ పై తుమ్మల ఫైర్

by Prasad Jukanti |

బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్ అయ్యారు.

Thummala : మీ రాజకీయాల కోసం రైతులను టెన్షన్ పెడతారా.. బీఆర్ఎస్ పై తుమ్మల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో యూరియా (Urea) కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. ఒకటి రెండు చోట్ల జరిగిన ఘటనలను చూపిస్తూ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ (BRS) సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. యూరియా కొరత వార్తలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి.. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉన్నా సోసైటీ తెరిచే సమయం కంటే ముందే అక్కడకి వచ్చిన కొంతమంది రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో ఉంచుతున్నారు. దాన్ని తమ స్వప్రయోజనం కోసం వీడియో తీసి సోషల్ మీడియాలో కొంత మంది నాయకులు కుటిల రాజకీయాల కోసం వాడుకొని రైతులను ఆందోళనకు గురిచేయడం బాధాకరం అన్నారు. జగిత్యాల పాస్కో లో 890 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అక్కడ వేచి ఉన్న రైతుల సంఖ్య 80కూడా దాటరన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసుల చేత టోకెన్లు జారీ చేశారనడం కూడా అవాస్తవం అని అనవసరంగా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు.

గత యాసంగి కంటే ఈ యాసంగిలో ఇప్పటికే 1.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపిణీ చేశామని, రాష్ట్రంలో 1.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. మరో 40 వేల టన్నుల యూరియా ఈ నెలలోనే పంపిణీ చేస్తున్నామని, మార్చినెలలో కూడా లక్షా 80 వేల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరాకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కేవలం వార్తల కోసం, పాస్ బుక్కులు లేదా చెప్పులు లైన్లో పెట్టించి, యూరియా కొరత అనే వార్తలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. రైతాంగాన్ని (Farmers) ఆందోళన పరిచే ఇటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు మంత్రి హితవు పలికారు. ఎక్కడైనా యూరియా సరఫరాలో, పంపిణీలో నిజంగా సమస్య ఉంటే సంబంధిత వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. యూరియా పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రైతాంగానికి విజ్ఙప్తి చేశారు.

Next Story