విద్యాసంస్థల్లో కుల వివక్షకు తావులేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

విద్యాసంస్థల్లో కుల వివక్షకు తావులేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రజా భవన్​లో జాతీయ ఎస్సీ కమిషన్​ చైర్మన్​ కిషోర్​ మక్వానాతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇక కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రాంతాలలో మొదటగా వీలైనంత ఎక్కువ సంఖ్యలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెంచుతున్నామని, రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు ఇచ్చినట్లు, ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానాను కోరారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story