కన్నీళ్ల ఖరీఫ్.. నెలన్నర రోజులుగా తీవ్ర వర్షాభావం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-16 02:04:43  IST  )

ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లా నేడు బీడు దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఒకరోజు కూడా పూర్తిస్థాయిలో వరణుడు కరుణించిన దాఖలాలు లేవు. దీంతో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉన్నాయనుకొని బోరు బావులు నమ్ముకుని సేద్యం కు ముందుకొచ్చిన రైతన్నలకు ఆశనిపాతం ఎదురైంది.

కన్నీళ్ల ఖరీఫ్.. నెలన్నర రోజులుగా తీవ్ర వర్షాభావం
X

దిశ, నిజామాబాద్ అర్బన్: ధాన్యాగారంగా పేరున్న ఇందూరు జిల్లా నేడు బీడు దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఒకరోజు కూడా పూర్తిస్థాయిలో వరణుడు కరుణించిన దాఖలాలు లేవు. దీంతో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉన్నాయనుకొని బోరు బావులు నమ్ముకుని సేద్యం కు ముందుకొచ్చిన రైతన్నలకు ఆశనిపాతం ఎదురైంది. కళ్ళ ఎదుట పంటలు ఎండిపోతుంటే అన్నదాతల ఆవేదనకు అంతులేకుండా పోతుంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన మొదలైంది. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఈ సీజన్ లో పడిన కష్టం నష్టంగా మారేలా ఉంది. పచ్చని పొలాల్లో భూమికి పచ్చని పందిరి వేసినట్లు ఉండే వరి పంటలు భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయానికి మూలాధారమైన నీరు లేక సాగు చేసిన రైతుల కు కన్నీరు మిగులుతోంది. చేసిన కష్టంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా వృథాగా మారుతోంది.

ఎగువన మంజీరా నది, దిగువన గోదావరి నదుల సమ్మేళనంతో అన్నపూర్ణగా వెలుగొందుతున్న నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మోస్తారు వర్షాలు కూడా నమోదు కాకపోవడంతో రైతులు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. గోదావరి, మంజీరా నదులతో నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్ జలాశయాలకు ఇప్పటివరకు వరద నీరు రాలేదు. చెరువులు, వాగులు, కుంటలు జలకళలేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో 1.05 లక్షల ఎకరాలకు నీరందించే ఎస్సారెస్పీ జలాశయం దీనస్థితిలో ఉండిపోయింది. గోదావరిపై ఆధారపడిన మధ్యతరహా ఎత్తిపోతల పథకాలైన అర్గుల రాజారాం (గుత్ప), అలీ సాగర్ ఎత్తిపోతలు నీరు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే రన్నింగ్ లో ఉన్న 16 మినీ ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి. బోరు బావుల పై ఆధారపడి నాట్లేసిన 1.30 లక్షల ఎకరాల వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ఆరుతడి పంటలను రక్షించుకునేకుందుకు నానా తంటాలు పడుతున్నారు. నారుమడులను రక్షించుకునేందుకు నీటి ట్యాంకులను పెట్టి నీరు ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మొత్తం 5.45 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాలకు కూడా చేరుకోలేకపోయింది. మరో వారం రోజులు వర్షాలు లేకుంటే వేసిన పంటలు కూడా ఎండిపోయే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

** పది మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం

జిల్లా వార్షిక సాధారణ సగటు వర్షపాతం 945.8 మిల్లీ మీటర్లు ఉంది. అయితే ఇప్పటివరకు (15-07-2026) 283.9 మిల్లీమీటర్ల వర్షం పడావాల్సి ఉంది. కానీ కేవలం 144.0 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. అంటే సగటున 33 మండలాల్లో చూస్తే -49 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఒక సిరికొండ, ధర్పల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మరో 21 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఇక ఆలూర్, ఏర్గట్ల, ఆర్మూర్, బాల్కొండ, సాలూర, మెండోరా, మోర్తాడ్, పోతంగల్, మాక్లూర్, మోపాల్ మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉండడం గమనార్హం. ఈ పది మండలాల్లో -60 నుంచి -70.8 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది.

ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికా :

వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నచోటనే వరి సాగు చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకు వర్షాలు పడవచ్చని భావిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా అన్నదాతల కోసం భవిష్యత్తు కార్యాచరణ తయారు చేస్తాం.

Next Story