అనుమతులు లేవు.. అఫిలియేషన్ సున్నా: ‘ఆదిత్య’ అడ్మిషన్ల దందా!

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్లు లేకుండానే అడ్మిషన్లు సాగిస్తున్నాయి.

అనుమతులు లేవు.. అఫిలియేషన్ సున్నా: ‘ఆదిత్య’ అడ్మిషన్ల దందా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చదువుల పేరిట వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను దోపిడీ చేయడమే కాకుండా.. వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, యూనివర్సిటీ అఫిలియేషన్లు లేకపోయినా హైదరాబాద్ లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలు, ఆదిత్య బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) స్పష్టమైన హెచ్చరికలు చేసినా, యాజమాన్యం మాత్రం కాలేజీ బోర్డుపై ‘అఫిలియేటెడ్ టు ఉస్మానియా’ అని ప్రస్తావించి అడ్మిషన్లు సాగిస్తుండటం విద్యా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీఎం సన్నిహితులమని చెప్పుకుంటూ..

‘ఆదిత్య’ బహిరంగంగా నిబంధనల ఉల్లంఘిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద హస్తమే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలోని కొందరు ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ కాలేజీలు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీకి చెందిన ఈ కాలేజీలు ఒక ప్రజాప్రతినిధివి కావడంతో, ఈ కాలేజీల అఫిలియేషన్లపై ప్రశ్నించిన వారితో సీఎం తమకు సన్నిహితుడని చెప్పుకుంటున్నట్లు సమాచారం.

అనుమతులు లేవు.. అఫిలియేషన్ సున్నా

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆదిత్య తీసుకున్న డిగ్రీ కాలేజీలకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కాలేజీలకు తాము అఫిలియేషన్ ఇవ్వలేదని, వీటితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఓయూ రిజిస్ట్రార్ ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. కనీస అనుమతులు లేని ఈ విద్యాసంస్థలు ‘ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్’ (ఏడీఏటీ) పేరుతో వినూత్నంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను బుట్టలో వేసుకుంటున్నాయి.

షిఫ్టింగ్ కు నో పర్మిషన్

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న పది ప్రముఖ డిగ్రీ కళాశాలను ఆదిత్య అభ్యాస్ అకాడమీ, కాకినాడ కింద మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అఫిలియేషన్ కు అవకాశమిస్తే ఈ విద్యాసంస్థలన్నీ ఇకపై కాకినాడ కేంద్రంగా పనిచేసే ‘ఆదిత్య అభ్యాస్ అకాడమీ’ యాజమాన్య నియంత్రణలోకి వెళ్లనున్నాయి. వీటిని ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య బిజినెస్ స్కూల్స్ కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాలేజీల షిఫ్టింగ్ కు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసినా.. వారు ఆ ఫైల్ ను పక్కపెట్టినట్లు తెలిసింది. కాగా, ఈ విషయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్-1982, సెక్షన్ 20(3) (A)(I) ప్రకారం ఇల్లీగల్ షిఫ్టింగ్ ఆఫ్ కాలేజెస్ కాంట్రవెన్షన్ కింద కేసులు నమోదు చేయాలని సీజేఎస్ అనే సంస్థ ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసింది.

అఫిలియేషన్ కోసం ‘ఆదిత్య’ దరఖాస్తు చేసుకున్న కళాశాలలు

-సమత డిగ్రీ కాలేజీ (నారాయణగూడ, హైదరాబాద్)

-విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (అత్తాపూర్, రంగారెడ్డి)

-నాగార్జున డిగ్రీ కాలేజీ (గజ్వేల్, సిద్దిపేట)

-శ్రీనివాస డిగ్రీ కాలేజీ (మెదక్)

-శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఆఫ్ కామర్స్ (సరూర్‌నగర్)

-శ్రీ విద్యా డిగ్రీ కాలేజీ (ప్రశాంత్ నగర్, సిద్దిపేట)

-స్ఫూర్తి డిగ్రీ కాలేజీ (సంగారెడ్డి)

-వాణి డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్ (మెహిదీపట్నం)

-శ్రీ మారుతి డిగ్రీ కాలేజీ (నర్సాపూర్, మెదక్)

-శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ (ఘట్‌కేసర్)

‘సీజేఎస్’ వరుస ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం

‘ఆదిత్య’ కాలేజీల వ్యవహారంపై ఇతర ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నుంచి ఉన్నత విద్యామండలి, ఉస్మానియా యూనివర్సిటీకి వరుసగా ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఆదిత్య డిగ్రీ కాలేజీలకు ఎలాంటి అనుమతులు లేవని పెద్ద ఎత్తున సీజేఎస్ సంస్థ సీఎంఓ, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేసింది. ఆయా కాలేజీలు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయని, ఇది భవిష్యత్తులో విద్యార్థుల కెరీర్‌ను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఆయా కాలేజీల వ్యవహారంలో సీజేఎస్ నుండి అందిన ఫిర్యాదుతో రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశముందని ఉస్మానియా వర్సిటీ అధికారులు తెలిపారు.

Next Story