- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతుల్లేవ్.. అడిగేవారూ లేరు! మైలారం-మేడిపల్లిలో రియల్ దందాపై ఆరోపణలు
అనధికార లే-అవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా, భూ మార్పిడి పన్ను (నాలా) చెల్లించకుండా దర్జాగా లేఅవుట్లు వేస్తున్నారు.

అనధికార లే-అవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా, భూ మార్పిడి పన్ను (నాలా) చెల్లించకుండా దర్జాగా లేఅవుట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇళ్ల స్థలాల లేఅవుట్ వేయాలంటే ముందుగా పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. గ్రామాలు అయితే సంబంధిత పంచాయతీ, పట్టణాలు అయితే మునిసిపాలిటీ, నగరాలు అయితే కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి ఏమీ లేకుండా బొమ్మలరామారం మండలం మైలారం, మేడిపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో అక్రమ రియల్ దందా కొనసాగుతోంది. సామాన్యులు మోసపోవడమే కాక.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రియల్ వ్యాపారి సుమారు 150 ఎకరాలకు పైగా చేసిన వెంచర్ లో దాదాపు 15 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఎకరం కూడా ఇవ్వలేదని సమాచారం. అంటే ప్రభుత్వం నుంచి అక్రమ పద్దతిలో సొమ్ము కొట్టేడం, మరో విధంగా పంచాయతీకి రావాల్సిన భూమి విలువ సుమారు రూ. 5 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్ర చేసినట్లు సమాచారం.
దిశ నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీటీసీపీ ,రేరా అనుమతులు లేకున్నా రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గజాలలో ధర చెప్పి గుంటల్లో అమ్మకాలు చేస్తున్నారు. హైదరాబాద్ కు అతి సమీపంలో త్వరపడండి.. వెంటనే ప్లాట్లు కొనుగోలు చేయండి అంటూ సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ సారధ్యంలో అక్రమ ఫామ్ ల్యాండ్ దందా దర్జాగా సాగుతుంది. గుంటలు, గుంటలుగా బొమ్మలరామారం తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న బొమ్మలరామారం మండల కేంద్రానికి మండలం మైలారం, మేడిపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో మైలారం 72,74,75,83,86, 87,88 మేడిపల్లిలో 228,238,253,254,256,257,259,269,270,271,272,273,275,276,277,278,279,280,281,28 సర్వే నెంబర్ ల పేరుతో దందాను కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ సొమ్మును కొట్టేసే కుట్ర!
మైలారం, మేడిపల్లి గ్రామాలలో సియోరా వెంచర్ లో గజాలలో భూమికి ధర నిర్ణయిస్తారు. కానీ గుంటల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఈ గుంటల్లో అమ్మకాలు చేయడం వల్ల కస్టమర్లకు రైతు బంధు, రైతు బీమా వస్తుందని ఆశ చూపిస్తున్నారు. అలా చేయడంతో వ్యవసాయ భూమి కింద పరిగణిస్తారు. అలా పరిగణించినపుడు ఆ భూమిలో రోడ్లు వేయకూడదు. అది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఫామ్ ల్యాండ్ చేయడమే ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అలాంటి పరిస్థితిలో వెంచర్ భూమికి రైతు బంధు, రైతు బీమా పేరుతో ప్రభుత్వ సొమ్మును కొట్టేయడం మరింత నేరం. డీటీసీపీ, రేరా అనుమతి తీసుకున్న తర్వాత కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. అంతేగాకుండా 10 శాతం భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించడమే కాదు.. రిజిస్ట్రేషన్ చేసి పేపర్ పంచాయతీకి అప్పగించాలి. కానీ రియల్ వ్యాపారి సుమారు 150 ఎకరాలకు పైగా చేసిన వెంచర్ లో దాదాపు 15 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా ఎకరం కూడా ఇవ్వలేదని సమాచారం. అంటే ప్రభుత్వం నుంచి అక్రమ పద్ధతిలో సొమ్ము కొట్టేడం, మరో విధంగా పంచాయతీకి రావాల్సిన భూమి విలువ సుమారు రూ. 5 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్ర చేసినట్లు సమాచారం. ఆ వెంచర్ కు 2018లో అనుమతి తీసుకున్నారు. కానీ ఒకసారి అనుమతి తీసుకుంటే అది కేవలం రెండేళ్ల వరకు మాత్రమే ఉంటుంది. సియోరా వెంచర్ యాజమాన్యం వెంచర్ విక్రయాలకు తిరిగి అనుమతి తీసుకోవాల్సిన అవసరం. కానీ అవేం లేకుండా అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ రియల్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు!
దాదాపు 150 ఎకరాలకు పైగా రియల్ వ్యాపారులు వెంచర్ చేస్తుంటే గ్రామ స్థాయిలో పనిచేసే ప్రభుత్వ అధికారి నుంచి మండల స్థాయిలో పనిచేసే అధికారులు చోద్యం చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 8 ఏళ్లుగా అక్కడ పని జరుగుతుంటే కనీసం అధికార యంత్రాంగం అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని తెలుస్తోంది. అంటే రియల్ వ్యాపారి ఇచ్చే తాయిలాలకు ఆశపడి కళ్లుండి కబోదిలా చూస్తూ ఉండి పోయినట్లు తెలిసింది. ఈ వెంచర్ కు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా అని ఇద్దరు అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం కరువు. రియల్ వ్యాపారి తమకు అనుమతి ఉందంటూ కొన్ని కాగితాలు ఇచ్చారని, వాటిని పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తామని పేర్కొన్నారు. అంటే 8 ఏళ్లుగా అధికారులు ఏం చేసినట్లు. మొత్తం ఈ తతంగంలో అధికారులకు చేతులు తడపడం వల్లనే చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు.. -శ్రీ మాలిని, ఎంపీవో బొమ్మలరామారం
‘‘హెచ్ ఎండీఏ అనుమతి తెచ్చుకున్నామని చెబుతూ ఇంత కాలం అధికారులను నమ్మించారు. ఎక్కడ అనుమతి తీసుకున్న కూడా గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. వెంచర్‌లో 15 శాతం భూమి పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెంచర్ చేసిన దాని ప్రకారం సుమారు 15 ఎకరాల భూమి గ్రామ పంచాయితీ వచ్చే అవకాశం ఉంది. కానీ గజం భూమి కూడా ఇవ్వలేదు. విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం’’






