'కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరు': Hemanth Biswa Sarma

by Dishafeatures2 |
కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరు: Hemanth Biswa Sarma
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అందువల్లే ఆయన జాతీయ రాజకీయాల పేరుతో ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రబుత్వమేనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన మీకు బీజేపీ ముక్త్ భారత్ లభించదని, బీజేపీ అనేది ప్రజల గుండెల్లో ఉందని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి అపొజిషన్‌గా టీఆర్ఎస్ కానే కాదని ఆయన అన్నారు. కేసీఆర్ వద్ద చాలా డబ్బులు ఉన్నాయని, ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు.

అయితే ఈ పార్టీ పెట్టుకోవడానికి కేసీఆర్‌కు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అనేది అసలు సమస్య అన్నారు. కుటుంబ పార్టీలన్ని కుటుంబ సభ్యుల కోసమే ఆలోచిస్తాయని, కానీ బీజేపీలో వారసత్వాలు లేవని చెప్పారు. అందువల్లే బీజేపీ దేశం గురించి ఆలోచిస్తుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా నితీష్ కుమార్‌ను కేసీఆర్ కలవడంపై ఆయన సెటైర్లు వేశారు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఏకంగా ఉన్నాయని, కొత్తగా వారిని కేసీఆర్ ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాల ఐక్యత అనేది అసలు వార్తనే కాదన్నారు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరని ఆయన్ను అందరూ లైట్ తీసుకుంటారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరగాలని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేయాల్సింది భారత దేశం రోడ్లపై కాదని, తమ పూర్వీకులు విడగొట్టిన పాకిస్తాన్‌లో అంటూ సెటైర్లు వేశారు. దేశం ఎప్పుడో జోడో అయిపోయిందని అలాంటప్పుడు భారత్ జోడో యాత్ర దేనికని ప్రశ్నించారు.

Also Read : ముఖ్యమంత్రి సారూ.. ఇయ్యాల్టికి రెండేళ్లు



Next Story