పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన వద్దు: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన వద్దు: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో పెట్రోల్, డీజిల్ నిల్వలకు సంబంధించి సామాన్య ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవాళ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. చమురు కంపెనీలతో తాము నిరంతరం మాట్లాడుతున్నామని.. సరఫరాలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యేక కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్..

ఇంధన సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ (Special Control Room)ను ఏర్పాటు చేసిందని ఉత్తమ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైనా లేదా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కమిటీలు జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద నిల్వలను, సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తాయి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రెట్రోల్, డీజీల్ అక్రమ రవాణాను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను చూసి ప్రజలు బంకుల వద్ద క్యూలు కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంధన సరఫరాపై సర్కార్ పూర్తి పట్టుతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసానిచ్చారు.

Next Story