- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎబోలా విషయంలో ఆందోళన అవసరం లేదు.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణలో ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్‌పోర్టులోనే పటిష్ట చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.
గాంధీ హాస్పిటల్‌లో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని మంత్రి దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వెంటనే గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు, జిల్లా నిఘా బృందాలు, హాస్పిటల్స్ మధ్య నిరంతర సమన్వయం ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






