- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC: ఈసారి సీపీఐకి ఎమ్మెల్సీ లేనట్లే!.. కామ్రేడ్ లకు స్పష్టం చేసిన కాంగ్రెస్?
సీపీఐకి ఎమ్మెల్సీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Election) ఆసక్తిని రేపుతున్నాయి. సీట్ల కసరత్తుపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. అభ్యర్థుల ఖరారుపై ఇటు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), అటు పీసీసీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో ఈ అంశంపై చర్చించబోతున్నారు. ఈ క్రమంలో మిత్రపక్షం సీపీఐ (CPI) తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ దఫా సీపీఐకి ఎమ్మెల్యే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. వచ్చే ఎమ్మెల్సీ ఖాళీల భర్తీలో అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ (Congress) పార్టీ స్పష్టం చేసిందని.. ఈ మేరకు కామ్రేడ్‌లకు ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వచ్చే స్థానిక, గవర్నర్ కోటాలో..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశం కోసం సీపీఐ నేతల బృందం ఇటీవల సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ను వేర్వేరుగా కలిసింది. ఈ సందర్భంగా పొత్తు ధర్మంలో భాగంగా తమకు ఒక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ అవకాశాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో తమకు ఒకటి కేటాయించాలని, ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Koonanneni Sambasiva Rao) నేతృత్వంలోని బృందం కోరారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో సమీకరణాల నేపథ్యంలో వచ్చే దఫాలో అవకాశం ఇచ్చేందుకు హస్తం పార్టీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఒక ఎమ్మెల్సీ స్థానం, వచ్చే ఏడాది గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. ఆ సందర్భంలో సీపీఐకి చాన్స్ కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ సీపీఐ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో భారీగా ఆశావహులు..
నామినేషన్ల గడవు మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆశావహుల్లో జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లగా, విజయశాంతి సహా మరికొంతమంది హస్తినలో టికెట్ కోసం ఏఐసీసీ పెద్దల వద్ద పార్టీ కోసం తాము చేసిన త్యాగాలు, పనితీరుపై విన్నవించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇక అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో చర్చల అనంతరం ఇవాళ లేదా రేపటి వరకు అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.






