- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాస్టల్ లేదు.. భవనం లేదు.. ఇదేనా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు?
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం తాజాగా 434 పోస్టులను ఆమోదించింది. అయితే ఈ నిర్ణయం ఆలస్యంగా రావడంతో ఇప్పటికే కొనసాగుతున్న తరగతులు, విద్యార్థుల శిక్షణపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఇప్పటికీ మౌలిక వసతుల కొరతతోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2024 లో ప్రకటించిన ఈ కాలేజీలకు రెండేళ్ల తర్వాత కేడర్ స్ట్రెంథ్ మంజూరు చేయడం ఆలస్యానికి నిదర్శనంగా మారింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొత్తం 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు ప్రభుత్వం తాజాగా 434 పోస్టులను ఆమోదించింది. అయితే ఈ నిర్ణయం ఆలస్యంగా రావడంతో ఇప్పటికే కొనసాగుతున్న తరగతులు, విద్యార్థుల శిక్షణపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మరోవైపు నర్సింగ్ కాలేజీలకు నేటికీ సొంత భవనాలు కూడా లేవు.
తాత్కాలిక ఏర్పాట్లతోనే..
రాష్ట్రంలోని ఆందోల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట్, యాదాద్రి భువనగిరిలో 2024లో నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. కానీ అప్పటి నుంచి పూర్తిస్థాయి సిబ్బంది లేకుండానే విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ల్యాబ్ సిబ్బంది కొరతతో తాత్కాలిక ఏర్పాట్లతోనే క్లాసులు నిర్వహిస్తూ వచ్చారు. కొన్నిచోట్ల ఇతర కాలేజీల నుంచి డిప్యూటేషన్‌పై సిబ్బందిని తీసుకొచ్చి బోధన కొనసాగిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఎంఎస్సీ నర్సింగ్ చేసిన నర్సింగ్ ఆఫీసర్లతో క్లాసులు చెప్పించారు. తాజాగా ఈ నెలలోనే 233 మంది ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్లకు లెక్చరర్లుగా పదోన్నతి ఇచ్చారు. అయితే పదోన్నతులు వెలువడిన తర్వాత కేడర్ స్ట్రెంథ్ ఉత్తర్వులు రావడంతో పదోన్నతులు పొందిన లెక్చరర్లలో ఒక్కరంటే ఒక్కరిని కూడా నేరుగా కొత్త కాలేజీలకు కేటాయించే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండేళ్లుగా ఫ్యాకల్టీ లేక ఇబ్బందులు పడిన కాలేజీలకు ఈ పదోన్నతుల ప్రక్రియ వల్ల లాభం లేదని నర్సింగ్ వర్గాలు తెలిపాయి. అయితే పాత కాలేజీల్లో ప్రస్తుతం తగినంత కేడర్ స్ట్రెంథ్ ఉన్నందున కొత్త కాలేజీలకు లెక్చరర్లను డిప్యూటేషన్‌పై పంపించేందుకు కసరత్తు నడుస్తోందని సమాచారం.
ఒక్కో కాలేజీకి 31 పోస్టులు..
ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి నర్సింగ్ కాలేజీకి సగటున 31 పోస్టులను కేటాయించింది. ప్రొఫెసర్-కమ్-ప్రిన్సిపాల్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు వివిధ కేటగిరీల్లో పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది లెక్చరర్లు, ఏవో, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించారు. మొత్తం 14 కాలేజీలకు కలిపి 434 పోస్టులు మంజూరు చేశారు. వీటి నియామకాలు ఏ విధంగా చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం..
సకాలంలో సిబ్బంది నియామకాలు లేకపోవడం వల్ల విద్యార్థులు నాణ్యమైన శిక్షణ పొందడంలో ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్స్ నిర్వహణలో కూడా సమస్యలు తలెత్తాయన్నారు. కొత్త కళాశాలలు ఇంకా తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత క్యాంపస్‌లు లేకపోవడం, హాస్టల్ సౌకర్యాల లోపం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు కేడర్ స్ట్రెంథ్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలో నియామకాలు పూర్తిచేస్తారా? సొంత భవనాల నిర్మాణం, మౌలిక వసతులు మెరుగుపరుస్తారా? అన్నది వేచి చూడాలి. లేదంటే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.






