ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం ముందుకు సాగదు : ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ ఉద్యోగుల గురించి జీరో అవర్లో మాట్లాడడం జరిగిందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని బిజెపి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.

ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం ముందుకు సాగదు : ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల గురించి జీరో అవర్లో మాట్లాడడం జరిగిందని, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని బిజెపి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంగళవారం మాట్లాడుతూ ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం ముందుకు సాగదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం15వ తేదికి జీతాలు, రిటైర్డ్ అయిన వాళ్ళకి కొంతైనా బిల్లులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు తప్ప ఏమీ ఇవ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల గురించి ఈ ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. గత ఏడాది మార్చి నుంచి 20,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని తెలిపారు. ఎన్నికలు వస్తే విద్య, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు విపరీతంగా పనిచేస్తాయని రిటైర్డ్ అయిన వాళ్లకు అలవెన్స్ లేవని, ఉద్యోగం చేస్తున్న వారికి టి.ఏ, డీఏ మాట లేదని పీఆర్సీ ఊసే లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ చుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నా వారికి అలవెన్సులు లేవని పేర్కోన్నారు. 750పైగా ఉద్యోగులు వారి పెండింగ్ బిల్లుల కోసం కోర్టుకు వెళ్లారని అయినా ఇప్పటికి ఇవ్వలేదని తెలిపారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 18 నెలలుగా మెయింటెనెన్స్ బిల్లులు లేవని అధికారులు సొంతంగా ఖర్చు చేస్తున్నారన్నారు. కెసిఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకనే రిటైర్మెంట్ వయస్సు పెంచారన్నారు. సుమారు 14 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నెలకు రూ.700 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు విడుదల చేస్తామని ఇప్పటికి ఆరు నెలల గడుస్తున్నా, వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదని ప్రశ్నించారు. మార్చి 1వ తేదీ లోపు ఉద్యోగస్తులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే 2 తేది నుంచి నిరాహార దీక్ష చెపడతానని తెలిపారు. ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసే పరిస్థితి వస్తే పాలనా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని హెచ్చరించారు.

Next Story