ఛార్జీలు పెంచబోం .. నెలకు రూ.10 కోట్ల భారం భరించేందుకు సిద్ధం : టీజీఎస్ ఆర్టీసీ

by Naga Rani Yarlagadda |

ఇరాన్ యుద్ధ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నా.. రాష్ట్ర ప్రజలపై ఆ భారాన్ని మోపకూడదని TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది.

ఛార్జీలు పెంచబోం .. నెలకు రూ.10 కోట్ల భారం భరించేందుకు సిద్ధం : టీజీఎస్ ఆర్టీసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇరాన్ యుద్ధ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నా.. రాష్ట్ర ప్రజలపై ఆ భారాన్ని మోపకూడదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతానికి బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ లేదని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ధరల్లో మార్పులు ఉండబోవని, పాత ఛార్జీలతోనే బస్సులు నడుపుతామని యాజమాన్యం పేర్కొందని... అయితే, భవిష్యత్తులో ఇంధన ధరలు ఒక చోట స్థిరపడిన తర్వాత, అప్పటి పరిస్థితులను బట్టి ఛార్జీల సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

లీటరుకు రూ. 6 పెంపు.. నెలకు రూ. 10 కోట్ల అదనపు భారం!

ఇంధన ధరల పెరుగుదల టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంస్థ అంతర్గత లెక్కల ప్రకారం.. లీటర్ డీజిల్ ధర కేవలం ఒక్క రూపాయి పెరిగినా, సంస్థకు నెలకు అదనంగా రూ. 1 కోటి 28 లక్షల అదనపు భారం పడుతుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు లీటరుపై ఏకంగా రూ. 6 వరకు ధర పెరిగింది. ఈ లెక్కన సంస్థపై ప్రతి నెలా రూ. 7. 68 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. టీజీఎస్ఆర్టీసీలో మొత్తం 10,130 బస్సులు నడుస్తుండగా, వీటికి ప్రతి రోజు సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు... నెలకు దాదాపు 1.80 కోట్ల లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. రోజుకు 6 లక్షల లీటర్ల వినియోగానికి గాను లీటరుకు రూ. 6 చొప్పున.. సంస్థపై రోజుకు రూ. 36 లక్షల అదనపు భారం పడుతుంది. నెలవారీ వినియోగం సగటున 1.80 కోట్ల చొప్పున లెక్కిస్తే నెలకు రూ. 10 కోట్లకు పైగా భారం పడనుంది. అదే గరిష్ట వినియోగం 2 కోట్ల లీటర్ల పరిమితిని తాకితే ఈ భారం నెలకు ఏకంగా రూ. 12 కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఇంతటి భారీ ఆర్థిక భారాన్ని (రోజుకు రూ. 36 లక్షల పైచిలుకు) సంస్థే స్వయంగా భరిస్తూ, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఛార్జీలను స్థిరంగా ఉంచాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనంగా మారనుంది.

Next Story