పీవీ స్వగ్రామంలో ‘నో’ డెవలప్‌మెంట్

by Disha Web Desk 4 |
పీవీ స్వగ్రామంలో ‘నో’ డెవలప్‌మెంట్
X

దిశ, భీమదేవరపల్లి : అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్ని తానై ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేశారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని వంగర గ్రామం నుండి ఆయన విద్యార్థి దశ నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. పివీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి.కానీ ఆయన మరణానంతరం వంగర గ్రామాన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.నేడు పివీ 102 వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక కథనం...

పాములపర్తి వేంకట నరసింహారావు జూన్ 28, 1921 జన్మించారు.ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి.

అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు.1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.పివీ అధికారంలో ఉన్నప్పుడు వంగర గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు.

పోలీస్ స్టేషన్, పివి మోడల్ కాలనీ, రక్షిత త్రాగునీటి బావి,సిసి రోడ్ల నిర్మాణం,బాలికల గురుకుల విద్యాలయం,24 గంటలు పనిచేయు ఆసుపత్రి,సబ్ స్టేషన్ మంజూరయ్యాయి. నిత్యం కేంద్ర రాష్ట్ర మంత్రులతో వంగర గ్రామం సందడిగా ఉండేది. ఒకవైపు దేశం మరొకవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పివీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకొని నిలబడేలా చేయడంతో పాటు భారత ఖ్యాతిని ప్రపంచ నలు దిశల ఇనుమడింపజేసిన ఘనత పివికే దక్కింది.కాగా 2004 డిసెంబర్ 23న పివీ తుది శ్వాస విడిచారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పి.వి

పాలకులు మరిచిన ఇక్కడి ప్రజలు పివీని గుండెల్లో పెట్టుకున్నారు. చందాలు సేకరించి మరి పివీ విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడి ప్రజలు పివీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకుంటారు.పీవీ నరసింహారావు కు భారతరత్న ఇవ్వాలని జిల్లాకు పివి పేరు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గ్రామంలో నత్త నడకన సాగుతున్న అభివృద్ధి పనులు

పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగర చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామన్నారు. కానీ నేటికీ పనులు మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.పి వీ స్మృతి వనం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.వంగర గ్రామంలోని చెరువు కట్ట కింది రోడంకు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నేటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. కస్తూరిబా గాంధీ విద్యాలయం నుండి వంగర గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మించడంతోపాటు స్వాగత తోరణం సైతం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కాని ఆ పనులను గుర్తుచేసే ప్రజా ప్రతినిధి లేకుండా పోయాడు. పివీ స్వగృహాన్ని మ్యూజియంగా మార్చి పివి గుర్తులు అందులో ఏర్పాటు చేస్తామని అన్నారు. నేటికి అది జరగలేదు. వంగర గ్రామం నుండి వయా రత్నగిరి గద్దల బండ వరకు నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు పూర్తి చేస్తామని కనీసం శంకుస్థాపనలు కూడా చేయకుండా గాలికి వదిలేసిన దుస్థితి వంగర గ్రామంలో నెలకొంది. దీంతో గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read More: పీవీ స్ఫూర్తితో ముందుకు సాగుతాం : సీఎం కేసీఆర్


Next Story

Most Viewed