మూసారంబాగ్ లో బాలుడిపై వీధి కుక్కల దాడి

by Disha Web Desk 11 |
మూసారంబాగ్ లో బాలుడిపై  వీధి కుక్కల దాడి
X

దిశ, మలక్ పేట్ : మలక్ పేట్ లోని మూసారంబాగ్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్ పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ఇంట్లోంచి బయటికి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయి కుమార్, అలేఖ్య దంపతులు. వీరికి ఉజ్వల్ కుమార్ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు సంతానం ఉన్నారు. సాయి కుమార్ కుటుంబం బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్ మలక్ పేట్ మూసారంబాగ్ లో నివాసం ఉంటున్నారు.

ఈ నెల 27న (శనివారం) సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా... ఉజ్వల్ కుమార్ నిద్ర లేచి అపార్ట్ మెంట్ గేట్ వైపు వెళ్తుండగా... వీధి కుక్కలు ఒక్కసారిగా వచ్చి ఉజ్వల్ కుమార్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మొదట ఉజ్వల్ కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచ్చింది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి. ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది.

చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి.. అక్కడి మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్ కుమార్ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని... 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed