- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS బీసీ నేతల్లో నో కో-ఆర్డినేషన్! ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య గ్యాప్
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల మీదనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల మీదనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. అధికార పార్టీ సైతం ఢిల్లీ వెళ్లి 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నా చేసింది. మరోవైపు.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ బీసీ రిజర్వేషన్లపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. అయితే.. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్‌లో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తున్నది. ఎలాగూ అధిష్టానం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. దాంతో ఆ పార్టీలోని బీసీ నేతలే బీసీ రిజర్వేషన్లపై కొట్లాడుతున్నారు. అయితే.. ఈ బీసీ నేతల మధ్య సైతం ఇటీవల గ్యాప్ పెరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకరి మీద ఒకరు అలక ప్రదర్శిస్తున్నారని భవన్ వేదికగా వినిపిస్తున్నది. తమదే పైచేయి ఉండాలన్న టార్గెట్‌తో నేతల మధ్య ఐక్యత లోపించినట్లుగా తెలుస్తున్నది.
పేరు కోసం ఎవరికి వారే..
బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో ఇటీవల రెండు మూడు సందర్భాల్లోనూ మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో బీసీ నేతలంతా భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు.. పార్టీ తరఫున చేపట్టాల్సిన ఉద్యమంపై చర్చించారు. ఈ సమావేశాలకు కేసీఆర్ కానీ.. కేటీఆర్ కానీ హాజరుకాలేదు. ఈ క్రమంలో బీసీ నేతలే బీసీ ఉద్యమాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో బీసీ ఉద్యమంలో పేరు తెచ్చుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో బీసీ నేతల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లుగా చర్చ నడుస్తున్నది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నది.
సమన్వయం లోపం..
బీఆర్ఎస్ బీసీ నేతల మధ్య సమన్వయలోపం ఉన్నట్లు బీసీ నేతల నుంచే వినిపిస్తున్నది. అందులో భాగంగానే కరీంనగర్ సభను వాయిదా వేయాల్సి వచ్చిందన్న ప్రచారం సైతం జరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు నేతలు చెప్పినా.. ఈ సమన్వయలోపం వల్లనే సభ తారీఖును మార్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తలసాని హాజరుకాలేదు. మిగితా నేతలు వెళ్లారు. సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. అలాగే.. ఇటీవల తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ వీరి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే.. ప్రెస్‌మీట్‌కు ముందే ఎవరెవరు ఏం మాట్లాడాలి అనే దానిపై చర్చించుకోవడం సాధారణం. కానీ.. వీరు మాత్రం ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ప్రెస్‌మీట్‌కు వచ్చినట్లుగా వారి తీరును బట్టి అర్థమైంది. ముందుగా ఓ మాజీ మంత్రి మాట్లాడగా.. ఆ తరువాత మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకు మాట్లాడాలని మైక్ ఇచ్చారు. కానీ..ఇంతలోనే మరో మాజీ మంత్రి ఆ మైక్‌ను లాక్కొని మాట్లాడేశారు. దాంతో ఆ ఎమ్మెల్యే అలకబూనారు. ‘ఇక మీరే మాట్లాడుకోండి.. నేను మాట్లాడను’ అంటూ అసంతృప్తికి గురయ్యారు. దాంతో ఆ సమావేశంలో ఆయన మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇలా ప్రెస్‌మీట్లలోనూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తుండడంపై పార్టీలో ఆసక్తిక చర్చ నడుస్తున్నది.
కరీంనగర్ సభ సక్సెస్ అయ్యేనా? (బాక్స్)
ఇప్పటికే నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బీసీ గర్జన సభపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. నేతలంతా కలిసికట్టుగా బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సింది పోయి ఇలా వాళ్లకు వాళ్లు అలకలు చేస్తుండడంపై సభ ఏ మేరకు సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు.. ఈ సభకు పార్టీ నుంచి పెద్ద స్థాయి లీడర్ ఎవరు హాజరవుతారు అన్న అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరో మూడు రోజుల్లో సభ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఏర్పాట్లు సైతం పెద్దగా మొదలైంది లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు వస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఇంతవరకు బీసీ నేతల నుంచి కానీ, పార్టీ నుంచి కానీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది లేదు. దీంతోపాటే పార్టీలోని బీసీ నేతల మధ్య లోపించిన ఐక్యతతో.. ఈ సభకు బీసీ నేతలంతా హాజరవుతారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.






