- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం.. పీజీ డిప్లొమా సీట్లు రద్దు
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిప్లొమా కోర్సులను పూర్తిగా రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిప్లొమా కోర్సులను పూర్తిగా రద్దు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) నిర్ణయించింది. వైద్య విద్య ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, స్పెషలిస్ట్ శిక్షణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పీజీ డిప్లొమా సీట్లన్నింటినీ పీజీ బ్రాడ్ స్పెషాలిటీ డిగ్రీ (ఎండీ/ఎమ్‌ఎస్) సీట్లుగా మార్చాలని ఎన్‌ఎమ్‌సీ స్పష్టం చేసింది.
2027-28 నుండి పూర్తిస్థాయిలో అమల్లోకి..
ఈ మార్పులు 2027-28 విద్యాసంవత్సరం నుండి పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి. ప్రస్తుత 2026-27 విద్యాసంవత్సరమే పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు చివరి సంవత్సరమని ఎన్‌ఎమ్‌సీ సెక్రటరీ డా. రాఘవ్ లాంగర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2027-28 విద్యాసంవత్సరం నుండి డిప్లొమా కోర్సుల్లో ఎలాంటి అడ్మిషన్లు ఉండవని, ఆ తర్వాత ఆ కోర్సులు పూర్తిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ప్రస్తుతం పీజీ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తూ, వాటిని పీజీ డిగ్రీ (ఎండీ/ఎమ్‌ఎస్) కోర్సులుగా మార్చుకోవాలనుకునే మెడికల్ కాలేజీలు, విద్యాసంస్థలు మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ)కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఎన్‌ఎమ్‌సీ ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కాలేజీల్లో ఉన్న మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, క్లినికల్ మెటీరియల్ వంటి ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఎన్‌ఎమ్‌సీ నిబంధనల ప్రకారం సీట్ల మార్పిడికి అనుమతులు ఇస్తారని బోర్డు డైరెక్టర్ సి.కె. రామస్వామి పేర్కొన్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ, కాలపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను ఎంఏఆర్బీ త్వరలోనే విడిగా విడుదల చేయనుంది.






