ముసురు ముప్పు.. నరకం చూపిస్తున్న రోడ్లు..

by Bhanu |   (  Updated:2025-07-27 03:31:00  IST  )

మూడు రోజులుగా ముసురు కమ్ముకున్నది. ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ముసురు ముప్పు.. నరకం చూపిస్తున్న రోడ్లు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మూడు రోజులుగా ముసురు కమ్ముకున్నది. ఎడతెరిపి లేకుండా జోరు వాన పడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలంలో శిథిల భవనాలతో ప్రమాదం పొంచివుంది. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండగా, వాటిలో నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భయాందోళనకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు తడిసి ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోననే భయంతో బిక్కు బిక్కు మంటూ బతికే కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి.

వీరంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ, వర్షాకాలం రాగానే ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని పేద,మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలితో అన్న చందంగా తయారయ్యే పరిస్థితులని ముందుగానే ఊహించలేకపోతున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక నష్టపరిహారం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముంపు ప్రాంతాల వివరాలు సేకరిస్తూ, కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లకుండా, ఎక్కడా ఇబ్బందులు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లు దాదాపు 8 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో చాలా ఏళ్ల క్రితం పాతకాలంలో మట్టి గోడలతో నిర్మించిన పేదకుటుంబాల ఇళ్లే అధికంగా ఉన్నాయి. వీటికి తోడు ఇటుక, సిమెంటు తో నిర్మించిన ఇళ్లు కూడా ఉన్నప్పటికీ వాటి సంఖ్య స్వల్పంగానేఉన్నట్లు సమాచారం. వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల యజమానులకు గ్రామ పంచాయతీల ద్వారా నోటీసులిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. వీటికి తోడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, ఆర్మూర్, బోధన్ , భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో కూడా వర్షాకాలంలో ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలున్నాయి.

వాటికి కూడా మున్సిపల్ కమిషనర్లు నోటీసులిచ్చారు.ఇళ్లు,భవనాల యజమానులు కొందరు స్పందించి ఆయా ఇళ్లను కూల్చేసినప్పటికీ, చాలా మంది ఏవో కుంటిసాకులు చెప్పుకుంటూ దాటవేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేయించుకుంటూ అవే ఇళ్లలో ఉంటున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన వర్షాకాలంతో ప్రజలు నివాసయోగ్యంగా లేని ఇళ్లను, భవనాలను, అపార్ట్మెంట్లను గుర్తించి, వాటిని ఖాళీచేయించాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్షాలు,వరదలు కారణంగా ఏదో నష్టం జరగక ముందే స్పందించి, నష్టనివారణ చర్యలకు పూనుకుంటే విలువైన ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని నివారించినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లు ధ్వంసం..

జిల్లాలో గ్రామాలను కలిపే ప్రధాన రహదారులతో పాటు గ్రామీణప్రాంతాల్లో, పట్టణ,నగర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లన్నీ నాలుగు రోజులుగా ముసురుపట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారుల మధ్య భారీ గుంతలేర్పడి వాటిలో నీటి కుంటలను తలపించేలా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులేర్పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇందల్వాయి మండలం లింగాపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న వంతెన పక్క నుండి వేసిన తాత్కాలిక రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాద వశాత్తు వాగులోకి జారిపోయింది. ఎవరికేం ప్రమాదం జరగకపోయినా, వర్షాకాలంలో రోడ్ల దైన్యస్థితిని చెప్పకనే చెపుతోంది. భీమ్గల్ వాగుపైనున్న వంతెన రెయిలింగ్ కూడా ధ్వంసం కాగాఎన్నో యేళ్లుగా వాటికి మరమ్మతులు చేయలేక పోతున్నారు.

దాంతో ప్రతి సీజన్ లో వాగులోని వరదను తిలకించడానికి వచ్చే జనాలు సెల్ఫీల కోసం వంతెన రెయిలింగ్ పై ప్రమాదకరంగా కూర్చుంటున్నారు. రెయిలింగ్ పూర్తిగా విరిగి ఇనుప చువ్వల ఆధారంతో ఉన్న రెయిలింగ్ ఎక్కడ పూర్తిగా విరిగిపోయి సెల్ఫీ దిగే జనాలు వాగులో పడిపోతారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 60 వార్డుల్లో దాదాపు సగానికన్నా ఎక్కువ వార్డుల్లో అంతర్గత రోడ్లు చాలా అధ్వానంగా మారిపోయాయి. వాటి మరమ్మతులకు కానీ, కొత్తగాసీసీ రోడ్లు వేయించడంపై అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ కాలనీలోని ఉప్పల మల్లయ్య పెట్రోల్ బంక్ పక్కనున్న రోడ్డు పొడవుగా పదుల సంఖ్యలో రోడ్డుపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.

చేంగల్ చింతలూరు గ్రామాల మధ్య రోడ్ల ధ్వంసం..

భీమ్ గల్ మండలం చేంగల్, జక్రాన్ పల్లి మండలం చింతలూరు గ్రామాల మధ్య బిటి రోడ్డును నిర్మించి మధ్యలో అక్కడక్కడా కొంత మేర వదిలేశారు. గతప్రభుత్వ హయాంలో రోడ్డు వేశారు. దాదాపు నాలుగేళ్లవుతున్నా చేయాల్సిన పనిని పూర్తిచేయక పోవడంతో వర్షాకాలమే కాదు ఏ కాలంలోనైనా ఈ రోడ్డుపై ఇబ్బందులేర్పడుతున్నాయి. ఇదే రోడ్డులో రెండేళ్లక్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా బిటి రోడ్డు పక్కన రోడ్డు నీటి వరదతో కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అక్కడ పాడైన రోడ్డును అలాగే వదిలేశారు తప్ప ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోసిరోడ్డును బాగుచేయించలేని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసేవరకు ఎదిరి చూస్తున్నారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. వర్షాకాలంలో అధిక వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం కాకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story