ఇప్పటివరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి : మంత్రులు ఉత్తమ్, తుమ్మల

by Bhanu |

జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సాఫీగా సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.

ఇప్పటివరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి : మంత్రులు ఉత్తమ్, తుమ్మల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సాఫీగా సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల స్థితిగతుల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. యాసంగిలో జిల్లాలో 4.91 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేయగా, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు. దీనికి అనుగుణంగా ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35 వేల నుండి 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 700 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 460 కేంద్రాలలో ధాన్యం సేకరణ నూటికి నూరు శాతం పూర్తయ్యిందని, ప్రస్తుతం 260 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం విలువ రూ. 1839 కోట్లు కాగా, రూ. 1548 కోట్ల బిల్లు మొత్తాలను రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన టాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని వివరించారు.

గన్నీ బ్యాగుల కొరత లేదు..

జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, 2.13 కోట్ల గన్నీ బ్యాగులు వచ్చాయని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని, ధాన్యం తరలింపునకు సంబంధించి లారీల కొరత తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. అన్ని కేంద్రాలలో సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా, మిల్లుల వద్ద వెంటదివెంట ధాన్యం దిగుమతి చేసుకునేలా పక్కాగా పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయ్యిందని అన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణను ఓ మహా యజ్ఞంలా భావిస్తూ, రైతుల నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. సన్నాలకు బోనస్ సైతం చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 60.14 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను సేకరించడం జరిగిందన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో పోలిస్తే ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో ధాన్యం సేకరణ జరుపుతున్నామని తెలిపారు. 2022-23 యాసంగిలో 25 .35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగగా, 2023 -24 లో 32 .93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ఇప్పటికే 49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని వివరించారు.


ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నందున కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా ఇంటర్మీడియట్ గిడ్డంగులను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం నిల్వలు తడిసిపోకుండా వాతావరణ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. మరో రెండు వారాల పాటు ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలని, నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ మంజూరీలు తెలుపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోగస్ కార్డులు జారీ కాకుండా పకడ్బందీ పరిశీలన జరపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగూబాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story