పోస్టల్ అకౌంట్ కోసం అగచాట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

by Chintha Aamani |

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం మధ్యాహ్నం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు.

పోస్టల్ అకౌంట్ కోసం అగచాట్లు.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద గురువారం మధ్యాహ్నం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. అలసిపోయే దాకా పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒకరినొకరు కొప్పులు పట్టుకుని చేతులతో కొట్టుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఓ మహిళైతే ఏకంగా కర్ర తీసుకుని క్యూలో తనతో గొడవ పడిన మహిళలను చితకబాదడం అక్కడి ఘర్షణ తీవ్రతను తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం త్వరలో ప్రారంభం కానుందని, పోస్టల్ అకౌంట్ ఉన్న మహిళలకే ఈ పథకం వర్తిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో మహిళలు పోస్టల్ అకౌంట్ తీసుకోవడానికి పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు.

పోస్టల్ అకౌంట్ లేని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ. 2,500 లు ఖాతాలో జమ కావని, రాఖీ పౌర్ణమి లోపే ఈ ఖాతా తీసుకోవాలని ప్రచారం జరగడంతో మహిళలంతా వేలం వెర్రిగా పోస్టాఫీసుల వద్ద క్యూ కడుతున్నారు. పోస్టల్ అకౌంట్ ఉంటేనే మహాలక్ష్మి పథకం వర్తింపు అనే వదంతి ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ, నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నిజామాబాద్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద వారం రోజులుగా మహిళలు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు.

తాజాగా, గురువారం కూడా దాదాపు 500 ల మంది వరకు మహిళలు పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్టల్ ఖాతా తీసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లన్నీ చేతిలో పట్టుకుని ఉదయాన్నే వచ్చి క్యూ కట్టి నిలుచున్నారు. అప్పటి వరకు తను ముందంటే తను ముందంటూ మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటూ క్యూలో నిలుచున్నారు. ఇంతలో ఒక్కసారిగా క్యూలోని కొందరు మహిళలు రెచ్చిపోయి పిచ్చపిచ్చగా కొట్టుకోవడం క్యూలైన్ లో ఉన్న ఇతర మహిళలను భయాందోళనకు గురి చేసింది. వీరి గొడవతో ఎలాంటి సంబంధం లేని మహిళలకు కూడా దెబ్బలు తగలడంతో వారు సైతం మహిళలపై హస్తలాఘవం ప్రదర్శించారు. ఒక మహిళనైతే అక్కడే పక్కన పడి ఉన్న ఓ కర్రను తీసుకున వచ్చి ఇష్టారీతిన తోటి మహిళలపై దాడి చేయడంతో కొద్ది సేపు అక్కడేం జరుగుతోందో, మహిళల ఘర్షణ ఎటు వైపు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరకు స్థానిక ఉద్యోగులు, అధికారులు కల్పించుకుని మహిళలను సముదాయించడం తో గొడవ సద్దుమణిగింది. మహిళలంతా శాంతించి మళ్లీ క్యూలైన్లలో నిల్చోవడంతో తుఫాను వెలిసినట్లయ్యింది.

జిల్లా సరిహద్దు లోని మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వలస కార్మిక మహిళలు జిల్లా కేంద్రంలో వివిధ పనులు చేస్తున్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ఎవరో పొలిటికల్ లీడర్ మహారాష్ట్రకు చెందిన లేబర్ కేటగిరి మహిళలకు ఆశలు కల్పించినట్లు తెలుస్తోంది. పోస్టల్ అకౌంట్ ఉన్నవారికే మహాలక్ష్మి పథకం వర్తింపు అనే విషయాన్ని లోకల్ పొలిటికల్ లీడర్లు మహిళల్లో ప్రచారం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఏ పార్టీకి చెందిన వారు ఈ వదంతులు వ్యాపింపజేశారనేది మాత్రం తెలియరాలేదు.

ఈ విషయంపై పోస్టల్ అధికారులను, సంక్షేమ పథకాల అమలు అధికారులు మాత్రం మహాలక్ష్మి పథకం అమలు విషయంపై మాకెలాంటి సమాచారం ప్రభుత్వం నుండి రాలేదని చెబుతున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెపుతున్నారు. మహిళలకు తామెంతగా వివరించినా వినడం లేదని, ఒక్కసారిగా వందల సంఖ్యలో ప్రతిరోజు మహిళలు పోస్టాఫీసులకు తరలివస్తుండటంతో సర్వర్‌లు కూడా బిజీ అవుతున్నాయంటున్నారు.

Next Story