హున్సాలో పిడిగుద్దులాట కు ఈసారి బ్రేక్ పడేనా..?

by Naveena |

గ్రామీణ రెజ్లింగ్ ను తలపించేలా సాగే హున్సా పిడిగుద్దులాటకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

హున్సాలో పిడిగుద్దులాట కు ఈసారి బ్రేక్ పడేనా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి 13: గ్రామీణ రెజ్లింగ్ ను తలపించేలా సాగే హున్సా పిడిగుద్దులాటకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రతియేటా హోలీ పండగ రోజున గ్రామంలో జరిగే ఈ పిడిగుద్దులాటకు ప్రతి సంవత్సరం పోలీసులు అభ్యంతరం చెపుతారు. ఈ ఆటను ఆడొద్దంటూ పోలీసులు గ్రామస్థులను హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, గ్రామస్థులు పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఐక్యంగా జరుపుకునే ఉత్సవం కావడంతో.. పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుండా చేసేది లేక భారీ స్థాయిలో బందోబస్తును మాత్రం ఏర్పాటు చేస్తారు.

ఈ సారి సీపీగా సాయి చైతన్య చార్జి తీసుకున్నాక హున్సాలో జరిగే పిడిగుద్దులాటపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి ఈ ఆటను నిలువరించాలని, ఈ ఆటను ఆడనివ్వకుండా అడ్డుకునేందుకు ముందడుగేశారు. ఇందులో భాగంగా పోలీసులు గ్రామస్థులకు నోటీసులు జారీ చేశారు. హోలీ పండగ రోజున గ్రామంలో ఎవరూ 5 గురికన్నా ఎక్కువగా ఎక్కడా గుమి కూడి ఉండకూడదని నోటీసులో సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా, న్యూసెన్స్ క్రియేట్ అయ్యేలా జనాలు పోగవడం చేయకూడదని నోటీసులో పోలీసులు హెచ్చరించారు.

ఈ నోటీసును గ్రామస్థులకు ఇచ్చేందుకు ఓ కానిస్టేబుల్ గ్రామానికి వెళ్లగా నోటీసు తీసుకునేందుకు నిరాకరించారు. పిడిగుద్దులాట నిర్వహించకుండా గ్రామంలో జరిగే అనర్థానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో ఇలాగే పండగ జరుపకపోతే ఓ ఇద్దరు ముగ్గురు చనిపోయారని, గ్రామస్థులు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని కానిస్టేబుల్ తో గ్రామస్థులు అన్నారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తరువాత నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిడిగుద్దులాట ను నిర్వహించి తీరాలనే పట్టుదలతో గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పిడిగుద్దులాటను అడ్డుకునేందుకు పోలీసులు.. ఎలాగైనా నిర్వహించి తీరాలని గ్రామస్థులు పట్టుదలతో ఉన్నారు. శుక్రవారం హోలీ రోజున ఏం జరుగుతుందోననే టెన్షన్ ప్రజల్లో నెలకొంది.

Next Story