ఆ స్థలంలో బస్టాండు నిర్మాణం హుళక్కేనా..

by Disha Web Desk 20 |
ఆ స్థలంలో బస్టాండు నిర్మాణం హుళక్కేనా..
X

దిశ, భిక్కనూరు : రాత్రికి రాత్రి చెట్లను తొలగించి, మొరం కొట్టించి విలువైన హైవే స్థలంలో ఎవరి అనుమతులు తీసుకోకుండా గుర్తు తెలియని వ్యక్తులు లెవెల్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నో రోజులుగా ఆ స్థలంలో బస్టాండు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు అభిప్రాయపడుతుండగా, కమర్షియల్ వాడకం కోసం భూమిని చదును చేయడం హట్ టాపిక్ గా మారింది. భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని 44వ జాతీయ రహదారి పక్కన, రెండు దాబా హోటళ్ళ మధ్య, హైవేను ఆనుకొని ఉన్న స్థలంలో చెట్లను తొలగించి భూమిని లెవెల్ చేశారు. భూమి ఎవరిదైనా...? ఆ స్థలంలో పనులు చేపట్టడానికి ముందు, 44 వ జాతీయ రహదారిని మెయింటెన్ చేసే జీఎంఆర్ సిబ్బందికి సమాచార మివ్వడంతోపాటు, ఆ స్థలం పరిధిలోని గ్రామపంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది.

వారెవరి అనుమతులు లేకుండా ధైర్యంగా ఆ స్థలంలో కాలుమోపి అధికారులు పెంచిన చెట్లను సైతం రాత్రికి రాత్రే తొలగించి మొరం కొట్టించి తెల్లారేసరికి ఆ స్థలం రూపు రేఖలనే మార్చేశారు. అంత ధైర్యంగా స్థలాన్ని లెవెల్ చేశారంటే, వారి వెనక ప్రముఖ నాయకుని హస్తం ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. కమర్షియల్ వాడకం కోసం ముందుగా ఆ ప్రముఖ నాయకునితో ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే ఆ స్థలంలోకి అడుగు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ రహదారి మధ్యలో నుంచి 100 ఫీట్ల దూరం స్థలం హైవే అథారిటీకి ఉండడంతో అదే స్థలంలో ఐదురోజుల క్రితం మిట్ట మధ్యాహ్నం పనిచేస్తుండగా జీఎంఆర్ సిబ్బంది కంట్లో పడ్డారు. ఈ స్థలమెవరిదని చదును చేస్తున్నారంటూ బెదిరించడంతో కిమ్మనకుండా సైలెంట్ గా వెళ్ళిపోయారు.

ఆ తరువాత మూడురోజులు అర్ధరాత్రి చీకట్లో పనులు చేస్తూ భూమిని చదును చేశారు. హైవేకి ఆనుకొని ఉండడం పైగా వ్యాపార పరంగా ఆ స్థలంలో ఏమైనా పెట్టుకుంటే బిజినెస్ బాగా నడుస్తుందన్న ఉద్దేశంతోనే ఆ భూమిని లేవల్ చేసి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఒకపక్క బస్టాండు ఉన్నప్పటికీ, అవతలి వైపు బస్టాండ్ లేకపోవడంతో ఆ స్థలంలో బస్టాండ్ నిర్మించాలని కొందరు గ్రామస్తులు సర్పంచ్ జనగామ శ్రీనివాస్ పై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో హైవే కు సంబంధించిన సుమారు 300 గజాల స్థలం చదును చేయడంతో బస్టాండ్ నిర్మాణం పై ఆశలు వదులుకోవలసిందేనా..? అన్న అనుమానాలను గ్రామస్థులుకొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి చేయాలని కొందరు గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

అనుమతి తప్పనిసరి..

హైవేపక్కన స్థలం వాడుకోవాలంటే తప్పనిసరిగా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవలసి ఉంటుందని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామసర్పంచ్ జనగామ శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన ఒక పట్టాదారు హైవే స్థలాన్ని కమర్షియల్ వాడకం కోసం లెవెల్ చేయించాడని, తమ పర్మిషన్ తో పాటు, హైవే అథారిటీ పర్మిషన్ లేకుండా పనులు చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు.

ఆ స్థలం హైవేదే..

లెవెల్ చేసిన విషయమై జీఎంఆర్ ఇంచార్జ్ లక్ష్మణ్ ను" దిశ "వివరణ కోరగా హైవే కి సంబంధించిన స్థలాన్ని చదును చేస్తుండగా సిబ్బంది అడ్డుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం స్థలం తమ పర్యవేక్షణలోనే ఉందని, ఎవరైనా ఆ స్థలంలో ఏదైనా పని చేపట్టాలన్నా, హైవే అథారిటీ కామారెడ్డి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారిచ్చిన ఫార్మేట్ ప్రకారం దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలని, అప్పుడు వారు అనుమతినిస్తే మేము ఫాలో అవుతామని వివరించారు.


Next Story

Most Viewed