పోచారం‌ శ్రీనివాస్‌రెడ్డికి పదవీ గండం..! పార్టీ ఫిరాయింపుతో వేటు తప్పదా?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-01 06:55:46  IST  )

బీఆర్ఎస్‌లో మంత్రి పదవితో పాటు స్పీకర్‌గా కూడా పదవులను అనుభవించిన సీనియర్ పొలిటిషియన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ మధ్య పదవీ గండం భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ తన ఎమ్మెల్యేగిరి దూరమవుతుందోననే ఆందోళనతో పెద్దాయన ఆగమాగమవుతున్నట్లు కనిపిస్తోంది.

పోచారం‌ శ్రీనివాస్‌రెడ్డికి పదవీ గండం..! పార్టీ ఫిరాయింపుతో  వేటు తప్పదా?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్‌లో మంత్రి పదవితో పాటు స్పీకర్‌గా కూడా పదవులను అనుభవించిన సీనియర్ పొలిటిషియన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ మధ్య పదవీ గండం భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ తన ఎమ్మెల్యేగిరి దూరమవుతుందోననే ఆందోళనతో పెద్దాయన ఆగమాగమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు కూడా ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దశాబ్దాల రాజకీయ జీవితంలో పోచారం ఇలాంటి ఆందోళనకర పరిస్థితిని ఏనాడూ ఎదుర్కొనలేదని, పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల అనర్హత వేటు భయంతో తీవ్రంగా మధన పడుతున్నారని ఆయనను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కార్యకర్తలు, సన్నిహితులు అంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ పై ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పై పార్టీ ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై డెసిషన్ గవర్నర్ దగ్గరే పెండింగులో ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు కాగా, వారంతా టెక్నికల్ గా తాము పార్టీలో చేరలేదని, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు రుజువు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

వేటుకు సిద్ధమవుతున్నారనే ప్రచారంతో ఆందోళన

కొద్ది రోజులుగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలెదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు గవర్నర్ నోటీసులు కూడా జారీ చేశారని, ఆ ఎమ్మెల్యేలపై గవర్నర్ త్వరలోనే వేటుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పోచారం ప్రెస్ మీట్‌లో పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యల్లో తను అనర్హత వేటును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకోసం తాను పడుతున్న తిప్పలు ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా వినిపించినట్లు తెలుస్తోంది. తాను నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని ప్రెస్ మీట్ లో పోచారం చెప్పారు. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నట్లు వివరించే ప్రయత్నం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదన్నారు.

తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని, తాను ఏ తప్పు చేయలేదని పోచారం సమర్ధించుకున్నారు. తన మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయడం, నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేగా బాధ్యత అని చెప్పుకొచ్చారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, ఆయన కూడా బాన్సువాడకు భారీగా నిధులిచ్చారన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్‌ను అడిగిందే తడవుగా ఏదడిగితే అదిచ్చారని, అందుకే నియోజకవర్గ అభివృద్ధి చేయగలిగానన్నారు. ఆ అభివృద్ధి మధ్యలో ఆగిపోకూడదనే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిధులడిగితే ఆయన కూడా భారీగానే మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్నారని పోచారం చెప్పుకొచ్చారు. అంతే కానీ, తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. తప్పు చేసినట్లయితే తనను చెప్పుతో కొట్టాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ పోచారంతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ నెలకొంది.

వేటు తప్పదనుకుంటే ముందుగానే రాజీనామా?

తనపై అనర్హత వేటు తప్పదనే పరిస్థితే గనక వస్తే, వేటు పడకముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో కూడా పోచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన పోచారం చూడని హైట్స్ లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోచారం పేరు తెలియకుండా రాజకీయాలే లేవు. అలాంటి ఉన్నత స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న నేత తన రాజకీయ జీవితంలో దాదాపు రిటైర్మెంట్ దశలో ఉండగా అనర్హత వేటు పడి పదవిని కోల్పోతే అది పొలిటికల్ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలి పోతుందనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన కొడుకులు, కుటుంబ సభ్యులు, రాజకీయంగా అత్యంత సన్నిహితులుగా ఉన్న మరి కొందరితో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. పేరున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాదులతో కూడా తన పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. న్యాయ పరంగా ఈ సమస్య నుండి బయటపడే మార్గాల గురించి అన్వేషించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పోచారం విషయం ఉమ్మడి జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story