మక్కలపై ఎందుకింత చిన్నచూపు.. కొనుగోలు కేంద్రాలెందుకు తెరవరు?

by Jakkula.Mamatha |   (  Updated:2025-10-14 01:53:38  IST  )

ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని

మక్కలపై ఎందుకింత చిన్నచూపు.. కొనుగోలు కేంద్రాలెందుకు తెరవరు?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వరి పండించిన రైతులను పట్టించుకున్నంతగా, మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ప్రకృతి పగబట్టి వర్షాలతో నష్టపరిస్తే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా దళారుల చేతిలో నష్టపోయేలా చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నారు. మొదట్లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో మొక్కజొన్న పంటకు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. తరువాత ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ, అతి భారీ వర్షాల కారణంగా మొక్కజొన్న నీటమునిగి, నేలకొరిగి పాడైంది.

కంకులు తడిసి మొక్కలపైనే బూజు పట్టి పంటకు నష్టం కలిగింది. ఇన్ని ప్రతికూలతల మధ్య పంటను గత నెలలో కోతలు పూర్తి చేసుకుని అమ్మడానికి మక్కలను సిద్ధం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో మీన మేషాలు లెక్కిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం మొక్కజొన్న కోతలు పూర్తయినా, ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల జాడ లేదు. జిల్లా మార్క్ ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని చెబుతున్నారే తప్ప ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, అనుమతి రాకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు..

జిల్లా వ్యాప్తంగా 52 వేలకు పైగా విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్నను పండించారు. సాధారణంగా ఎకరాకు 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే మొక్కజొన్న ఈ సారి ప్రకృతి అననుకూలత కారణంగా దిగుబడి తగ్గింది. రైతులు పంట సాగుకు చేసిన పెట్టుబడి ఖర్చులు కూడా చేతికొచ్చేలా లేవని రైతులంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,400 లు వస్తే తమకు బాగా గిట్టుబాటయ్యేదని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో క్వింటాకు రూ. 1800 ల నుంచి రూ. 1900 ల మధ్య ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులంటున్నారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇటీవల మొక్కజొన్న రైతుల గోస పై స్పందించారు. క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితిని పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి సత్వరమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దళారులు చేతిలో క్వింటాకు దాదాపు రూ. 500 ల వరకు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు.

క్వింటా మక్కలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా రూ. 500 లు తక్కువ చెల్లించడంతో దాదాపు జిల్లాలోని రైతులు రూ. 65 కోట్లు నికరంగా నష్టపోతున్నారని రైతులు లెక్కలేసుకుంటున్నారు. ఈ నష్టానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మొక్కజొన్న రైతులు మండిపడుతున్నారు. వరి పంట దిగుబడులు కొనుగోలు చేసేందుకు ముందుగానే కొనుగోళ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, మక్కల కొనుగోళ్లకు ఎందుకు కేంద్రాలను ఇప్పటికీ ఎందుకు ప్రారంభించడం లేదని మండి పడుతున్నారు. మొక్కజొన్న రైతుల పై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE ......

రాష్ట్రంలో అన్నదాతల దైన్యం.. పంట నష్టపరిహారం కోసం ఎదురుచూపులు


Next Story