- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్గపోరుపై వాట్ నెక్స్ట్..
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టిపిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితులు నెలకొన్నాయి.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టిపిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితులు నెలకొన్నాయి. ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య వైరాన్ని తట్టి లేపాయి. దాంతో కామారెడ్డి కాంగ్రెస్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. క్రమశిక్షణ కమిటీకి ఇరువురు నేతలపై వారి వర్గం అనుచరులు ఫిర్యాదులు చేయడంతో కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వైరం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
వర్గపోరుపై చర్చ
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మూడేళ్ళ క్రితం ఎలాంటి రాజకీయ విబేధాలు ఉండేవి కాదు. చిన్నపాటి మనస్పర్థలు మినహాయించి పెద్దగా చెప్పుకోదగ్గ పొట్లాటలు ఉండేవి కాదు. గత ఏడాది కాలంగా కామారెడ్డి కాంగ్రెస్ లో తలోదారి అన్నట్టుగా సాగుతోంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టిపిసిసి జనరల్ సెక్రెటరీ అయినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న టాక్ వినిపిస్తోంది. పదవుల కేటాయింపులో సీనియారిటీ చూడలేదని, నిన్నమొన్న వచ్చిన వారికి ప్రయారిటీ ఇచ్చారన్న వాదన పార్టీలో వినిపించింది. అప్పటినుంచి పార్టీలో వర్గపోరు మొదలైందని చెప్పవచ్చు. అది ప్రస్తుతం తారాస్థాయికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తెరపైకి సీనియారిటీ
ఒకరిది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రాష్ట్రస్థాయిలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న నేత. మరొకరిది మూడేళ్ళ క్రితం పార్టీలోకి చేరిన పరిస్థితి. ఈ మద్యే వచ్చిన రాష్ట్ర నాయకుడి హోదా. ఇదే ఇప్పుడు క్యాడర్ మధ్య మాటల తూటాలకు బలంగా మారుతోంది. సీనియారిటీ కూడా చూడకుండా వ్యాఖ్యలు చేయడాన్ని షబ్బీర్ అలీ వర్గం తప్పు పడుతోంది. నలభై ఏళ్లుగా పార్టీలో ఉన్నవాళ్లు కావాలా.. మూడేళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు కావాలా అంటూ అధిష్టానానికి సూటిగా ప్రశ్నలు సంధించే పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఏ మాదిరిగా ఉందో అర్థం అవుతోంది.
సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్
కామారెడ్డి పట్టణంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం రాజకీయ రగడకు కారణమైందని ప్రచారం సాగుతోంది. స్మశాన వాటిక అభివృద్ధిని అడ్డుకోవడంపై చేసిన వ్యాఖ్యలు వర్గపోరును తారా స్థాయికి తీసుకెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో షబ్బీర్ అలీ వర్గం నేతలు చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని గత నెల 31 న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ నెల 5 న ప్రెస్ మీట్ పెట్టి సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్ వద్ద దీక్ష చేస్తామని, లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఎవరు ఉండాలో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
షబ్బీర్ ఆలీపై తీవ్ర ఆరోపణలు
షబ్బీర్ అలీ వర్గం నేతల ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఈ నెల 4 న చంద్రశేఖర్ రెడ్డికి 11లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నెలతీసులు జారీ చేశారు. అదే రోజు చంద్రశేఖర్ రెడ్డి వర్గం షబ్బీర్ ఆలీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కమిటీకి ఫిర్యాదు చేసింది. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఓటమికి షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులే కారణమని, ఆ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని తీవ్రమైన ఆరోపణలు చేయడం రాజకీయంగా మరింత దుమారం రేపాయి.
వాట్ నెక్స్ట్
నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్న వార్ అధిష్టానాన్ని సందిగ్ధంలో పదేసిందిన్న టాక్ వినిపిస్తోంది. ఇద్దరు ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో అధిష్టానం తేల్చుకోలేక పోతుందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే షబ్బీర్ ఆలీపై చేసిన ఆరోపణలకు సంబందించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని చెప్పడంతో అవి ఎక్కడ బయటపెడతారోనన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు చర్యలపై నాన్చుడు ధోరణి అవలంబిస్తే షబ్బీర్ అలీ వర్గం పార్టీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.






