- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల ప్రాంగణంలో పంచాయితీ ఏందయ్యా..?
పిల్లలకు అక్షరాలు దిద్దిస్తూ, పాఠాలు చెప్పాల్సిన ప్రాథమిక పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేసేందుకు పూనుకున్నారు.

దిశ, ధర్పల్లి: పిల్లలకు అక్షరాలు దిద్దిస్తూ, పాఠాలు చెప్పాల్సిన ప్రాథమిక పాఠశాల ఆవరణంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం చేసేందుకు పూనుకున్నారు. అక్షరాలు, పుస్తకాలతో సావాసం చేయాల్సిన విద్యార్థులు మెదిలే సరస్వతీ నిలయంలో కుళ్లు రాజకీయాలు చేసే గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ముగ్గుపోసి రాజకీయం చేస్తున్నారని ధర్పల్లి మండలం వాడి గ్రామంలోని యువకులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామంలో ఎక్కడా పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం దొరకనట్లు ఉద్దేశపూర్వకంగా ప్రైమరీ స్కూల్ ప్రాంగణాన్నే ఎంచుకోవడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పంచాయతీ భవనం నిర్మాణం జరగడాన్ని ఒప్పుకునేదే లేదని గ్రామంలోని యువకులు, గ్రామస్థులు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. ఐదేళ్ళు అధికారంలో ఉన్న గ్రామ సర్పంచ్, పాలకవర్గం, భవన నిర్మాణం కోసం చొరవచూపలేదని, పదవి నుండి దిగిపోయే ఒక్కరోజుముందు హడావిడిగా ప్రాఠమిక పాఠశాల ఆవరణలో గతంలో అంగన్ వాడి స్కూల్ కోసం నిర్మించిన అసంపూర్తి భవనాన్ని కూల్చేసి ఆ స్థలంలో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు శంఖుస్థాపన చేసేందుకు ప్రయత్నించారు. దీంతో దాన్ని గ్రామంలోని యువతరం యూత్ సభ్యులు, గ్రామస్థులు వ్యతిరేకించి అడ్డుకున్నారు. అయితే అప్పుడు పనులు నిలిపేశారు. ఈ విషయంపై ఐసీడీఎస్ అధికారులు కూడా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు.
అనంతరం ఎంపీడీఓ స్థల పరిశీలన చేసేందుకు రాగా గ్రామస్థులంతా పాఠశాల ఆవరణలో పంచాయతీ భవనాన్ని కట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇక్కడ పంచాయతీ భవన నిర్మాణం సరికాదని, ఇతర స్థలాన్ని పరిశీలించాలని ఎంపీడీఓ సూచించినట్లు తెలిసింది. వీడీసీ సమావేశంలో గ్రామంలోని యువకులు, గ్రామస్థులు ఎక్కువ సంఖ్యలో వ్యతిరేకించడంతో అది అక్కడితో ఆగిపోయింది. తాజాగా సోమవారం కొందరు వ్యక్తులు వీడీసీని ముందు పెట్టి మళ్లీ పాఠశాల ఆవరణలో అదే పంచాయతీ భవన నిర్మాణం కోసం ముగ్గు పోయడం వివాదాస్పదమైంది. బడగ్రామానికి సంబంధించిన రెండు ప్లాట్లు వేరే చోట ఉండగా కావాలని ఇక్కడే భవన నిర్మాణం చేపట్టడంలో అసలు ఉద్దేశమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వేరే చోట ఉన్న రెండు ప్లాట్లను గుట్టు చప్పుడు కాకుండా కాజేసే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో ప్లాన్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గ్రామంలోని యువకులు, గ్రామస్థులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు, పంచాయతీ అధికారికి, జిల్లా విద్యాధికారికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.






